ఆన్‌లైన్‌ పాఠం.. ఆర్థిక భారం | Online Classes: Financial Burden On The Middle Class Families | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ పాఠం.. ఆర్థిక భారం

Published Sat, Sep 5 2020 10:03 AM | Last Updated on Sat, Sep 5 2020 10:05 AM

Online Classes: Financial Burden On The Middle Class Families - Sakshi

సుభాష్‌నగర్‌లో టీవీలో పాఠం వింటున్న విద్యార్థులను పరిశీలిస్తున్న ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు

కరీంనగర్‌ పట్టణంలోని రాంనగర్‌ కుర్మవాడ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న లత అనే విద్యార్థిని ఇంటికి రెండు రోజుల క్రితం కలెక్టర్‌ శశాంక వెళ్లారు. ఆన్‌లైన్‌ తరగతి జరుగుతున్నా లత పాఠం వినకపోవడంతో ఏమైందని ప్రశించారు. సెల్‌ఫోన్‌ లేదని, కుటుంబ ఆర్థిక పరిస్థితిని విద్యార్థిని కలెక్టర్‌కు వివరించింది. స్పందించిన కలెక్టర్‌ తాను స్మార్ట్‌ఫోన్‌ కొనిస్తానని హామీ ఇచ్చారు.

సాక్షి, కరీంనగర్‌: ఆన్‌లైన్‌ అవస్థలు మొదలయ్యాయి. ఈనెల 1 నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు ఇప్పటికే క్లాసులు జరుగుతున్నాయి. అయితే ప్రతీ విద్యార్థికి సెల్‌ఫోన్, ట్యాబ్‌ తప్పనిసరైంది. వీటితోపాటు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, ఫీజులు తడిసిమోపెడవుతున్నాయి. జిల్లాలో 16 మండలాల్లో ప్రభుత్వ పరిధిలోని వివిధ కేటగిరీలకు చెందిన 672 ప్రభుత్వ పాఠశాలల్లో 34,994 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు వింటున్నారు.1,200పైగా ప్రైవేట్‌ పాఠశాలల్లో మరో 40 వేల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యార్థులు 74,994 మంది విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు మొదలు కాగా టీవీల ద్వారా వీక్షిస్తున్నారు. 23 శాతం మందికి టీవీలు అందుబాటులో లేవు. సెల్‌ఫోన్స్‌ లేవు. దీంతో వీరంతా పక్కిళ్లకు వెళ్లి క్లాసులు చూస్తున్నారు. అయితే టీవీలు లేని తల్లిదండ్రులు పిల్లల కోసం టీవీల కొ నుగోలు గురించి ఆలోచిస్తున్నారు. కేబుల్‌ కనెక్షన్‌ లేనివారు కొత్తగా కనెక్షన్‌ తీసుకుంటున్నారు. వ్యవసాయ పనులు సీజ న్‌లో తరగతులు ప్రారంభం కావడంతో అదనంగా ఆర్థిక భా రం పడుతోందని పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.  

ఖర్చు.. తడిసిమోపెడు..
కరోనా కష్టకాలంలో కుటుంబం గడువడమే గగనంగా ఉన్న పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ మధ్య తరగతి ప్రజలకు గుదిబండగా మారింది. రెండు నెలల నుంచి  ప్రైవేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు బోధిస్తున్నాయి. పూర్తిస్థాయిలో నర్సరీ నుంచి పదో  తరగతి వరకు ఈనెల నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. వీరంతా సెల్‌ఫోన్లలోనే పాఠాలు వినాలి. ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే వారిద్దరికీ సెల్‌ఫోన్స్‌ కోసం రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఖర్చు చేయాలి. నెట్‌ కోసం రూ.500 చొప్పున బ్యాలెన్స్‌ వేయించాలి. పుస్తకాలు, ఫీజులు ఇలా రూ.50 వేల రూపాయలకుపైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. కార్పొరేట్‌స్కూల్‌ విద్యార్థుల కోసం ఏకంగా రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు చేసి లాప్‌ట్యాప్‌లు కొనుగోలు చేస్తున్నారు. సెల్‌ఫోన్‌లో క్లాసులు వినే విద్యార్థుల కళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తలనొప్పితోపాటు ఇతర సైడ్‌ ఎఫెక్ట్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఒక ఎత్తు అయితే ఆర్థిక కష్టాలు తలనొప్పిగా మారాయి. కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలల ఫీజుల వసూళ్లు మొదలయ్యాయి. ఇన్నాళ్లు ఆన్‌లైన్‌ క్లాసులు బోధిస్తున్న కొన్ని స్కూళ్లు ఫీజులు వసూలు చేయగా, మరికొన్ని స్కూళ్లు వసూలు చేయలేదు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. అయినా వసూళ్లు జరుగుతున్నాయి. 

కరోనాతో మాకేంటి..
జిల్లా కేంద్రంలోని కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లు పదో తరగతి వి ద్యార్థి నుంచి రూ.లక్షకు పైగా వసూలు చేస్తున్నాయి. వివిధరకాల తోక పేర్లతో ఉన్న స్కూళ్లల్లోనూ లక్ష రూపాయల వరకు ఫీజులు ఉన్నాయి. ఎల్‌కేజీ, యూకేజీ చదివే విద్యార్థుల నుంచే రూ.20 వేలకుపైగా ఫీజులు వసూలు చేస్తున్నా యి. అయితే కరోనా ప్రభావం పూర్తిగా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడంతో ఇన్నాళ్లు ప్రైవేట్‌ పాఠశాలల్లో చది వించిన వారు మళ్లీ ప్రభుత్వ పాఠశాలకు పంపించలేక ఉన్న ఆభరణాలు, ఆస్తులు విక్రయించి ఫీజులు చెల్లిస్తున్నారు. 

అందుబాటులోకి రాని ఫోన్లు...
ప్రభుత్వ పాఠశాలలో ఆన్‌లైన్‌ క్లాసులు మొదలు కాగా ఉపాధ్యాయులు క్లాస్‌ ప్రారంభానికి ముందు, తరువాత ఫో న్‌ చేయాల్సి వస్తుంది. క్లాస్‌ టీచర్‌తోపాటు సబ్జెక్ట్‌ టీచర్‌ చేస్తున్నారు. దీనితో విద్యార్థులు సైతం విసుక్కోవాల్సిన పరి స్థితి. విద్యార్థుల ఫోన్లు ఎక్కువగా వారి తల్లిదండ్రుల వద్ద ఉంటా యి. వారు ఏదో పనిలో ఉంటున్నారు. విద్యార్థుల ఫోన్స్‌ అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులు ఒకటికి నాలు గుసార్లు  ఫోన్‌ చేస్తున్న పరిస్థితి. పిల్లలకు ప్ర త్యేకంగా సెల్‌ఫోన్‌ లేకపోవడంతో ఆన్‌లైన్‌ క్లాసులతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు.  

అధికారుల పాఠశాల బాట...
జిల్లాలో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై కలెక్టర్‌ కె.శశాంకతోపాటు డీఈవో జనార్దన్‌రావు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను పర్యటిస్తూ ఆన్‌లైన్‌ తరగతులు ఎలా జరుగుతున్నాయని ఆరా తీస్తున్నారు. చాలా మంది విద్యార్థులు తమ ఇళ్లల్లో స్మార్ట్‌ఫోన్, నెట్‌ కనెక్షన్, టీవీలు లేవని సమాధానం చెబుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement