సర్కారు బడుల్లోనూ వాట్సాప్‌ గ్రూపులు | Government Schools Also Using WhatsApp Group In Telangana | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్లోనూ వాట్సాప్‌ గ్రూపులు

Published Tue, Sep 1 2020 3:55 AM | Last Updated on Tue, Sep 1 2020 3:55 AM

Government Schools Also Using WhatsApp Group In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకే పరిమితమైన వాట్సాప్‌ పర్యవేక్షణ... ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకూ చేరింది. కరోనా నేపథ్యం లో విద్యాసంస్థలు మూతపడటంతో ఆన్‌లైన్‌ లేదా టీవీల ద్వారా పాఠ్యాంశ బోధనకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రమంలో ఆగస్టు 27 నుంచి విధులకు హాజరవుతున్న టీచర్లు.. తమ తరగతి విద్యార్థుల పర్యవేక్షణకు సామాజిక మాధ్యమాల వాడకాన్ని విస్తృతం చేశారు. ఇందులో భాగంగా వాట్సాప్‌ గ్రూప్‌ ఒకటి క్రియేట్‌ చేసి.. క్లాస్‌ టీచర్‌ అడ్మిన్‌గా ఉంటూ విద్యార్థులను ఆ గ్రూప్‌లో సభ్యులుగా చేరుస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా బోధన కార్యక్రమాలను సాగిస్తుండగా, తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ వాట్సాప్‌ వాడకం అనివార్యమైంది. 

సూచనలు, సందేహాల నివృత్తి.. 
ఆన్‌లైన్‌ పాఠ్యాంశ బోధనకు వాట్సాప్‌ గ్రూప్‌ వారధిగా నిలుస్తోంది. సెప్టెంబర్‌ 1 నుంచి వీడియో పాఠాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి లో ఉపాధ్యాయులు ఇప్పటికే వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులకు సలహా సూచనలు ఇస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖ నిర్దేశించిన విధంగా వర్క్‌షీట్లను పోస్టు చేయగా, విద్యార్థులు వాటిని చూసి నోట్‌ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆన్‌లైన్, టీవీ పాఠాల టైమ్‌టేబుల్‌ను పోస్ట్‌చేస్తూ విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలంటే ఆం దోళన కలిగించేదే అయినా.. టీచర్లు ప్రతి విద్యార్థితో వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడి అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులకు కలిగే సందేహాలను వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా లేదా నేరుగా ఫోన్‌ ద్వారా నివృత్తి చేస్తున్నారు. 

స్మార్ట్‌ఫోన్‌ లేకుంటే..: పట్టణ ప్రాంత పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రుల్లో దాదాపు 67 శాతం మందికి స్మార్ట్‌ఫోన్లు ఉన్నట్లు విద్యాశాఖ పరిశీలనలో తేలింది. ఇందులో వాట్సాప్, ఇంటర్నెట్‌ ఉన్నవి 50 శాతం మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతంలోపు విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద మాత్రమే స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అన్న, అక్క, ఇతర కుటుంబసభ్యుల వద్ద ఫోన్లు ఉన్నా.. ఆన్‌లైన్‌ క్లాసుల సమయంలో అవి అందుబాటులో ఉండవనే సమాధానం వస్తున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. అలాంటి వారికి ఉపాధ్యాయులు నేరుగా ఫోన్‌చేసి సూచనలిస్తున్నారు.  

డీడీ యాదగిరి ప్రసారాల షెడ్యూల్‌ విడుదల 
నేటి నుంచి దూరదర్శన్‌ యాదగిరి చానల్‌ ద్వారా వీడియో పాఠాల ప్రసారానికి సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ప్రతి క్లాస్‌ అరగంట పాటు ఉంటుంది. సెప్టెంబర్‌ 1 నుంచి 14 వరకు ప్రసారమయ్యే పాఠాల వివరాలను ఇందులో పొందుపర్చింది. షెడ్యూల్‌ను అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపింది. ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు సెప్టెంబర్‌ 1 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌ తరగతుల వివరాలను కూడా బోర్డు విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement