
సాక్షి, హైదరాబాద్: సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వ శాఖల్లోని ఉన్నతాధికారులను మార్చారు. ఇటు ప్రభుత్వ, అటు పోలీస్ యంత్రాంగంలోని సీనియర్ అధికారుల్లో కొందరికి స్థానచలనం కలిగించారు. మరికొందరు ఐఏఎస్ అధికారులు, ఒకట్రెండు జిల్లాల కలెక్టర్ల మార్పు కూడా జరిగింది. దీంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళన ఉంటుందని, జిల్లా కలెక్టర్ల నుంచి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు సంబంధించిన ముఖ్యమైన బదిలీలుంటాయనే ప్రచారం కూడా జరిగింది.
అయితే, లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అలాంటి ఆలోచన లేదని, పలు కారణాల రీత్యా మరో మూడు నెలల తర్వాతే పూర్తిస్థాయి ప్రక్షాళన ఉంటుందనే సంకేతాలందుతున్నాయి. ప్రస్తుతానికి తప్పనిసరి బదిలీలకు మాత్రమే పరిమితం కావాలని, ఆరుగ్యారంటీల అమలు ఓ కొలిక్కి రావడంతో పాటు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాతే భారీస్థాయిలో బదిలీలు చేపట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.
ఆరంభ దశలోనే ‘ప్రజాపాలన’
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డితో సహా ఏఐసీసీ కీలక నేతలు పలుమార్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలను అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే మిగిలిన వాటిని ప్రారంభించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే గత నెల 28న ‘ప్రజాపాలన’కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఈనెల 6వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకొని, గ్యారంటీలు అమలు చేసే ప్రక్రియతో ముందుకెళుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాగాన్ని బదిలీ చేయడం అవసరం లేదనే భావనలో సీఎం రేవంత్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన తర్వాత, వచ్చిన అన్ని దరఖాస్తులను మదింపు చేయాలి. వీటి ఆధారంగా రేషన్‌కార్డుల పంపిణీ నుంచి 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ వరకు మార్గదర్శకాలు రూపొందించాలి.
దీనికోసం ప్రభుత్వ యంత్రాంగం మరో నెలకు పైగా శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ, ఆరుగ్యారంటీల అమలు ఓ కొలిక్కి వస్తుంది. మరోవైపు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విధంగా మార్చి 15 వరకు (100 రోజుల్లో) ఈ ఆరు గ్యారంటీలు అమలు ప్రారంభించాలి. దీంతో ఇప్పుడు బదిలీలు చేస్తే కొంత గందరగోళానికి తావిస్తాయనే భావనలో సీఎం ఉన్నట్టు సమాచారం.
ఈసీ ఏం చేస్తుందో?
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ఇంకా ప్రారంభం కాకపోయినా ఓటరుజాబితా సవరణ ప్రక్రియ జరుగుతోంది. ఈనెల 6 వరకు ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించాలి. అనంతరం సవరణలు చేపట్టి వచ్చే నెల 8న పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితా ప్రకటించాలి. మరోవైపు నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ కూడా వచ్చింది. ఈ ఎన్నికకు ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టాలి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పెద్ద ఎత్తున కలెక్టర్ల బదిలీలు చేపట్టాలన్నా, ఎన్ని కల కమిషన్‌కు సమాచారం ఇవ్వాలి. మరోవైపు ఫిబ్రవరి రెండోవారం తర్వాత ఎప్పుడైనా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయి. ఈలోపు కలెక్టర్లు, ఇతర అధికారులను బదిలీ చేస్తే అప్పుడు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం మరికొన్ని బదిలీలు చేయాల్సి ఉంటుంది.
దీంతో కలెక్టర్ల బదిలీల గురించి కూడా సీఎం రేవంత్ పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారని సమాచారం. ప్రస్తుతానికి పెద్ద ఎత్తున కలెక్టర్ల బదిలీలు కూడా ఉండవని, అవసరమైతేనే కొన్ని జిల్లాల కలెక్టర్లను ఎన్నికల కమిషన్‌కు సమాచారమిచ్చి ఈసీ అనుమతి మేరకు బదిలీలు జరిగే అవకాశం కూడా లేకపోలేదనే చర్చ ప్రభుత్వవర్గాల్లో జరుగుతోంది.
ఎన్నికలు ముగిశాకే.. అన్ని స్థాయిల్లో
రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే తప్ప లోక్‌సభ ఎన్నికలు ముగిసేంతవరకు ప్రభుత్వ యంత్రాంగ బదిలీలుండవని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ఆ పార్టీ పెద్దలు సంకేతాలిస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో ఇదే విషయాన్ని ఓ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కాంగ్రెస్ నేతలకు చెప్పినట్టు తెలిసింది.
ఇప్పటికిప్పుడు బదిలీలు చేయలేం కానీ, మొండి ఘటాలను మాత్రం వదిలించుకుందామని ఆయన చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలతో పూర్తిస్థాయిలో సఖ్యత లేదనే ముద్ర ఉన్న అధికారులకు అడపాదడపా స్థానచలనం కలగవచ్చని, గత ప్రభుత్వానికి అంటకాగారనే ముద్ర ఉన్న అధికారులను కూడా బదిలీ చేయొచ్చని అంటున్నారు.