
సాక్షి, హైదరాబాద్: విద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాలకు కేంద్ర బడ్జెట్ 2023–24 మేలు మలుపు (గేమ్ చేంజర్)లాంటిదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభివర్ణించారు. విద్య, నైపుణ్యాభివృద్ధికి అత్యధిక కేటాయింపులతో రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో ఈ మూడు రంగాలకు కేటాయింపులపై శుక్రవారం ఆమె రాజ్‌భవన్‌లో ఆయా రంగాల నిపుణులతో చర్చాగోష్టి నిర్వహించారు.
జాతీయ విద్యా విధానం 2020 స్ఫూర్తికి అనుగుణంగా డిజిటల్ టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రోత్సాహకాలతో విద్యా రంగంలో మార్పులు రాబోతున్నాయన్నారు. వ్యవసాయ రంగ అంకుర పరిశ్రమలు, సాంకేతిక వినియోగం, ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకాలు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి కేటాయింపుల పెంపుతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని తెలిపారు. ఎన్‌ఐఆర్డీ, ఎన్‌ఏఆర్‌ఎం, ఇక్రిశాట్,సెస్, ఇఫ్లూ్ల, ఉర్దూ వర్సిటీల నిపుణులు చర్చలో పాల్గొని కేంద్రబడ్జెట్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్–2023 వేడుకల్లో భాగంగా గవర్నర్ అతిథులకు మినుములతో చేసిన వంటకాలను అందించారు.