అఫ్జల్‌గంజ్ (హైదరాబాద్): ఎగ్జిబిషన్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదని, దీనివల్ల ఎంతో విషయపరిజ్ఞానం పెరుగుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి యువ పారిశ్రామికవేత్తలు వచ్చి తమ వస్తువులను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించి, వాటిని విక్రయిస్తుంటారని, దీనివల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుందన్నారు. శనివారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన– 2022 (నుమాయిష్)ను మంత్రి మహమూద్‌అలీతో కలసి గవర్నర్ ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ..ఎగ్జిబిషన్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలోని 18 విద్యాసంస్థల ద్వారా ప్రతి ఏడాది సుమారు 30 వేలమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. గవర్నర్ ప్రసంగం ఆఖరులో తెలుగులో మాట్లాడుతూ..2021కి వీడ్కోలు పలికామని, నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పారు.
మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా నుమాయిష్‌కు మంచిపేరు ఉందని, ఇక్కడకు వచ్చి వస్తువులు కొనేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారన్నారు. 45 రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్‌లో కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. నుమాయిష్‌లో ప్రభుత్వం తరఫున వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రభాశంకర్, కార్యదర్శి ఆదిత్యమార్గం, మీడియా ఇన్‌చార్జ్ అశ్విని మార్గం, మాజీ ఉపాధ్యక్షుడు వివేక్‌కుమార్ ముదిరాజ్ పలువురు సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment