సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల లెక్క తప్పుతోంది. పద్దు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు, కేంద్ర సర్కారు కేటాయింపులకు పొంతన లేకుండాపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 38 వేల కోట్లకు పైగా వస్తాయని రాష్ట్రం ఆశిస్తే గత 7 నెలల్లో కేంద్రం రూ. 5 వేల కోట్లే ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఇంకో 5 నెలల్లో మరో 10 శాతానికి మించి నిధులు రావని, అంతపెద్ద మొత్తం సమకూర్చుకోవడం కష్టమని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.
సమకూర్చుకోవడం కష్టం
గత రెండేళ్లుగా రాష్ట్ర సర్కారు ప్రతిపాదించిన నిధుల కన్నా ఎక్కువగానే గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ను కేంద్రం మంజూరు చేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరం రూ.8,177 కోట్లను రాష్ట్రం బడ్జెట్‌లో ప్రతిపాదిస్తే కేంద్రం రూ. 11,598 కోట్లు.. 2020–21లో రూ.10,525 కోట్లు ప్రతిపాదిస్తే రూ. 15,471 కోట్లు ఇచ్చింది. అయితే ఈసారి రూ. 38,669 కోట్ల పద్దు కోరగా గత 7 నెలల్లో (2021 అక్టోబర్ 31 వరకు) రూ.5,155.98 కోట్లే కేంద్రం ఇచ్చినట్టు కాగ్ లెక్కలు చెబుతున్నాయి.
ఇప్పటివరకు ఇచ్చిన నిధులు ప్రతిపాదిత మొత్తంలో 13 శాతం మాత్రమేనని, చివరి 3 నెలల్లో కొంత మేర నిధులను పెంచినా ఇంకో 10 శాతం (రూ. 4 వేల కోట్లు) మాత్రమే వస్తాయిన ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంతా కలిపితే ఈసారి రూ.10 వేల కోట్లు దాటకపోవచ్చని అంటున్నారు.
ఇదే జరిగితే బడ్జెట్‌లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కిందనే రూ.23 వేల కోట్లకు పైగా లోటు ఉంటుందని, ఇంత భారీ మొత్తాన్ని ఇతర రూపాల్లో సమకూర్చుకోవడం సాధ్యమయ్యే పనికాదని చెబుతున్నారు. ఇప్పటికైనా బీజేపీ పాలిత రాష్ట్రాల తరహాలో రాష్ట్రానికీ ఉదారంగా నిధులను కేంద్రం మంజూరు చేయాల్సి ఉందని అంటున్నారు.
గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే?
రాష్ట్రాలకు కేంద్రం గ్రాంట్ల రూపంలో చేసే సాయాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు అంటారు. సాయం, విరాళం లేదా భాగస్వామ్యం రూపంలో ఒక ప్రభుత్వం నుంచి మరో ప్రభుత్వానికి ఈ నిధులు బదిలీ అవుతాయి. నేరుగా ప్రభుత్వానికి లేదా ఏదైనా పథకాన్ని అమలు చేసే ప్రభుత్వ సంస్థకు, ఆ సంస్థల ప్రతినిధులకు పంపే వెసులుబాటు ఉంది. ప్రభుత్వాలతో పాటు పంచాయతీరాజ్ విభాగాలకూ ఈ నిధులు అందుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డబ్బులను తమ వెసులుబాటు మేరకు వాడుకునే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment