నెట్ జీరో ఎనర్జీ బిల్డింగ్ నమూనా
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు నెట్ జీరో ఎనర్జీ భవనాలు దోహదపడతాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. లక్డీకాపూల్‌లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) కొత్త భవన నిర్మాణానికి బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు. నెట్ జీరో ఎనర్జీ/ వాటర్/ కార్బన్ భవనంగా దీనిని నిర్మిస్తుండడం అభినందనీయమన్నారు. పర్యావరణ మార్పుల నుంచి భూగోళాన్ని రక్షించుకునేందుకు, మానవాళి మనుగడను కాపాడుకునేందుకు ఇలాంటి చర్యలు అత్యవసరమని పేర్కొన్నారు.
శాస్త్రపరిజ్ఞానంలో వస్తున్న ఇలాంటి అధునాతన మార్పులను వినియోగించుకుని ముందుకు పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. సోలార్ ప్యానెళ్లు, ఇంధన పొదుపు డిజైన్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టం, స్మార్ట్ గ్రిడ్ మీటర్, ఇంధన పొదుపు లైటింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ భవనంలో ఉండనున్నాయని గవర్నర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగరావు, సభ్యులు మనోహర్‌రాజు, బి.కృష్ణయ్య, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ షర్మన్ తదితరులు పాల్గొన్నారు.
నెట్ జీరో ఎనర్జీ బిల్డింగ్ అంటే..
ఏడాదికి అవసరమయ్యే విద్యుత్‌ను అక్కడికక్కడే ఉత్పత్తి చేసుకుని వినియోగించుకునే భవనాలను నెట్ జీరో ఎనర్జీ బిల్డింగ్స్ అంటారు. సౌర విద్యుత్‌ను అక్కడికక్కడే ఉత్పత్తి చేసి నిల్వ చేసుకునే సదుపాయాన్ని ఈ భవనాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా భవనంపై కురిసే వర్షపు నీరు, పరిసరాల్లోని మురుగు నీటిని ప్రత్యేక ట్యాంకుల్లో నిల్వ చేస్తారు.
ఈ నీళ్లను శుద్ధి చేసి వాడుకుంటారు. ఇలాంటి భవనాలను నెట్ జీరో వాటర్ అంటారు. అంటే ఈ భవనాలకు బయట నుంచి విద్యుత్, తాగునీటి సరఫరా అవసరం ఉండదన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment