గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ‘లీకేజీ’ని సీబీఐకి అప్పగించాలి | Group1 Prelims leakage should be handed over to CBI | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ‘లీకేజీ’ని సీబీఐకి అప్పగించాలి

Published Thu, Aug 17 2023 1:43 AM | Last Updated on Thu, Aug 17 2023 10:09 AM

Group1 Prelims leakage should be handed over to CBI - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ప్రశ్న పత్రం లీకేజీ దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. పిల్‌పై అభ్యంతరాలను పక్కకు పెట్టి, పిటిషన్‌కు నంబర్‌ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం బుధవారం రిజిస్ట్రీని ఆదేశించింది. ఫైలింగ్‌ నంబర్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్, హైదరాబాద్‌ సీపీ, సీబీఐ డైరెక్టర్‌కు నోటీసులిచ్చింది. అలాగే పేపర్‌ లీకేజీ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో నివేదిక అందజేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఏప్రిల్‌లో దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలతో ఈ పిల్‌ దాఖలైంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రిజిస్ట్రీ నంబర్‌ కేటాయించలేదు.

సీజే ధర్మాసనం వద్ద విచారణ సందర్భంగా హోం శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రూపేందర్‌ వాదనలు వినిపిస్తూ.. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పేపర్‌ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్‌ ఇప్పటికే సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఆ పిటిషన్‌ విచారణ సందర్భంగా నిందితులపై కేసు నమోదు, అరెస్టు, దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది.. వంటి అంశాలపై సిట్‌ మూడు నివేదికలను కూడా కోర్టుకు సమర్పించిందన్నారు. ఈ పిల్‌ దాఖలు చేసిన పిటిషనర్‌ బక్క జడ్సన్‌.. కాంగ్రెస్‌ పార్టీ నేత అని చెప్పారు. నిష్పక్షపాతంగా సిట్‌ను దర్యాప్తు చేయకుండా ధిక్కరణ పిటిషన్లు కూడా వేస్తూ అడ్డుకుంటున్నారని చెప్పారు.  

కిందిస్థాయి సిబ్బందిపైనే కేసులు..
పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎస్‌.శరత్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. పేపర్‌ లీకేజీ అంశంలో టీఎస్‌పీఎస్సీకి చెందిన కిందిస్థాయి సిబ్బందిపైనే సిట్‌ కేసులు పెట్టిందని.. ఉన్నతాధికారు­లను మాత్రం వదిలేసిందని చెప్పారు. పాస్‌వర్డ్‌ లీక్‌కు కారణమైన టీఎస్‌పీఎస్సీ చైర్మన్, కార్యదర్శిపై ఎలాంటి కేసు పెట్టలేదన్నారు.

గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌తో పాటు మరికొన్ని నియామక పరీక్షల పేపర్లు లీక్‌ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయని వెల్లడించారు. పిల్‌కు నంబర్‌కు వేయాలని రిజిస్ట్రీని ఆదేశించడంతోపాటు దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న పిటిషన్‌ను కూడా ఈ పిల్‌కు జత చేసేలా దరఖాస్తు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement