సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ వేశారు. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిసెంబర్ 1న హరీష్‌రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారంటూ హరీష్‌రావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసు పెట్టారంటూ పేర్కొన్న హరీష్ రావు.. కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు.
తన, కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రతో అక్రమ కేసులు పెట్టారని... రియల్ ఎస్టేట్ వ్యాపారి జి.చక్రధర్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో హరీష్‌రావుపై ఈ కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి, రిమాండ్‌లో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును సైతం నిందితుడిగా చేర్చారు. వివిధ సెక్షన్ల కింద ఆదివారమే ఎఫ్‌ఐఆర్ నమోదవగా.. ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ‘‘సిద్దిపేటకు చెందిన చక్రధర్‌గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. 2022 సెప్టెంబర్ 25న సిద్దిపేటలోని కొండ భూదేవి గార్డెన్స్‌లో చక్రధర్.. ఆత్మహత్యలకు పాల్పడ్డ వంద మంది కౌలురైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత మరో 150 మందికి రూ.లక్ష నగదు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో భవిష్యత్తులో చక్రధర్‌గౌడ్ తనకు పోటీ అవుతారని హరీశ్‌రావు భావించారు.
అనంతరం సిద్దిపేట జిల్లాలో ‘అగ్గిపెట్టె మచ్చా‘ పేరిట మ్యాచ్‌బాక్స్ కంపెనీని ప్రారంభించనున్నట్టు చక్రధర్‌గౌడ్ ప్రకటించారు. దీనితో హరీశ్‌రావు చక్రధర్‌పై శామీర్‌పేట పోలీసుస్టేషన్‌లో తప్పుడు కేసు నమోదు చేయించి, అరెస్టు చేయించారు. అయితే 2023 మార్చి 15న చక్రధర్ బీజేపీలో చేరారు. అదే ఏడాది ఏప్రిల్ 28న హైదరాబాద్‌లోని పంజగుట్ట నాగార్జున సర్కిల్‌లో చక్రధర్‌కు చెందిన ‘ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్’ ఆఫీసుకు మఫ్టీలో వచ్చిన పోలీసులు ఆయనను టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీగా ఉన్న పి.రాధాకిషన్‌రావు ముందు హాజరుపర్చారు.
ఆయన చక్రధర్‌ను తీవ్రస్థాయిలో బెదిరించి, హరీశ్‌రావు అనుమతి లేకుండా సిద్దిపేట నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని హెచ్చరించారు. ఒకసారి పోలీసులు చక్రధర్ ఐఫోన్ తీసుకుని, తర్వాత తిరిగిచ్చారు. ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా వివరాలన్నీ తెలుసుకుని చక్రధర్‌ను, అనుచరులను బెదిరించారు. గతంలో మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు అధికార దురి్వనియోగానికి పాల్పడి ఈ చర్యలకు పాల్పడ్డారు’’ అని పోలీసులు ఎఫ్‌ఆర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment