భూములకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి
దివ్యాంగులనూ మోసం చేసిన కాంగ్రెస్: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగంలో భూములు కోల్పోతున్నవారికి న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రింగ్‌రోడ్డు కోసం చౌటుప్పల్ జంక్షన్ వద్ద 184 ఎకరాల భూమిని సేకరిస్తున్నారని.. ఆ భూములు, ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏ మాత్రం సరిపోదని తెలిపారు. ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు శనివారం హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించిన తర్వాత వారి
అంగీకారంతోనే భూ సేకరణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 26న దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహించే మహాధర్నాకు రావాల్సిందిగా ఆ సంస్థ ప్రతినిధులు శనివారం హరీశ్‌రావును కలిసి ఆహ్వానించారు. వారి సమస్యలపై కూడా పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, దివ్యాంగులను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని ప్రకటించి.. ఏడాది అవుతున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేసేంత వరకు బీఆర్‌ఎస్ పోరాడుతుందని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment