పోశవ్వకు కరోనా సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేయిస్తున్న మంత్రి హరీశ్
మంత్రి హరీశ్: పోశవ్వా.. ఎన్ని టీకాలు వేసుకున్నావ్?
పోశవ్వ: ఒక్కటే ఏసుకున్న.. సర్..
మంత్రి: ఇంకా రెండు ఏసుకోవాలి ఎందుకు ఏసుకోలే..
పోశవ్వ: భయం అయితంది సర్..
మంత్రి: ఎందుకు భయం, నేనున్న ఏసుకో..
పోశవ్వ: నువ్వు ఉన్నవని ధైర్యం వచ్చింది.. ఏసుకుంటా సర్.. అని నవ్వుతూ చెప్పింది.
సాక్షి, సిద్దిపేట: ‘వైద్య సిబ్బంది, వైద్యులే కాదు.. వైద్య అధికారులు కూడా కాదు.. నేరుగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రే ఫీవర్ సర్వేకు వచ్చారు. అందరితో ఆత్మీయంగా ముచ్చటించారు. కరోనా కారణంగా ఆందోళనలో ఉన్న ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందనే విషయాన్ని ప్రత్యక్షంగా చాటిచెప్పారు. శనివారం సిద్దిపేట మున్సిపాలిటీ 37వ వార్డులోని అంబేడ్కర్‌నగర్‌లో ఇంటింటా ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు.
27 వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధం
మంత్రి హరీశ్‌రావు ఇలా ఇంటింటికీ తిరుగుతూ అందరినీ పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీవర్ సర్వేలో భాగంగా మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 12.68 లక్షలమంది ఇళ్లకు మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ సిబ్బంది వెళ్లి 48 హోం ఐసోలేషన్ కిట్లు అందించారన్నారు. జ్వరపీడితుల ఆరోగ్య పరిస్థితిని ఆరోగ్య కార్యకర్తలు నిత్యం పరిశీలిస్తారని, అవసరమైతే దవాఖానాకు తరలించి వైద్యసేవలు అందిస్తారని చెప్పారు. 5 నుంచి 8 వారాలు ఈ ఫీవర్ సర్వే చేయిస్తామని, కరోనా పరీక్షల కోసం క్యూలైన్ పెద్దగా ఉన్నచోట మరిన్ని సెంటర్లు పెంచుతామని వెల్లడించారు. తెలంగాణలో ఫీవర్ సర్వే ఆదర్శంగా ఉందని కేంద్రం, నీతి ఆయోగ్ కితాబిచ్చిందని పేర్కొన్నారు. రోజూ కరోనా పరిస్థితిని అంచనా వేసి కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు సర్వేలపై జిల్లా కలెక్టర్లు సమీక్ష జరుపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 27 వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. కాగా, శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్ మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని దేశమంతా అమలు చేయాలని, అందుకోసం వచ్చే బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లను పెట్టించాలని తెలంగాణ బీజేపీ నేతలను డిమాండ్ చేశారు.
మంత్రి: అంజమ్మా.. మాస్క్ పెట్టుకోలే, ఇగో, మాస్క్ పెట్టుకో..
అంజమ్మ: హరీశన్న వస్తుండంటే ఆగమాగంగా బయటకు వచ్చిన సర్. నువ్ ఉన్నాక మాకు అన్ని మంచిగనే ఉంటాయి సర్..
Comments
Please login to add a commentAdd a comment