రావణకాష్టం కాకముందే ప్రజలు మేలుకోవాలి
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది.. జైనూరు ఘటనలో బాధితులకు న్యాయం జరగాలి
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హరీశ్‌రావు, ఇతర నేతలు
గాం«దీ ఆస్పత్రి (హైదరాబాద్): రాష్ట్రంలో పాశవిక ప్రభుత్వం రాజ్యమేలుతోందని, రాష్ట్రం రావణకాష్టం కాకముందే ప్రజలంతా మేల్కొనాలని పలువురు బీఆర్‌ఎస్ నేతలు పిలుపునిచ్చారు. జైనూరు ఘటనలో గాయపడి.. సికింద్రాబాద్ గాం«దీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ, అమె కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జైనూరులో ఆదివాసీ మహిళపై జరిగిన ఘటన అత్యంత దారుణమని, అత్యాచారం చేసి రాయితో ముఖంపై దాడి చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని, నాగర్‌కర్నూలు, జైనూరు, హైదరాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్లగొండ తదితర ప్రాంతాల్లో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు మచ్చుకైనా కనిపించడం లేదని అన్నారు.
తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో 1,900 అత్యాచారాలు, 2,600 హత్యలు, 230 ఆయుధాల కేసులు నమోదు అయ్యాయని ఆయన గణాంకాలతో వివరించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం రక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందంటూ కేంద్ర హోంశాఖ అధికారులు, దేశ భద్రతా సలహాదారు మెచ్చుకున్నారని, పోలీస్ గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ భద్రతకు మారుపేరు అని కితాబు ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన డీజీపీ బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే నిర్మల్, సనత్‌నగర్, గోషామహల్, జైనూరులో మత కలహాలు చెలరేగాయన్నారు. మెదక్ మతకల్లోలాన్ని అదుపు చేయడంలో విఫలమైన ఎస్పీని హైదరాబాద్ ఈస్ట్‌జోన్ డీసీపీగా నియమించారని ఆక్షేపించారు. డయల్ 100 పనిచేయడంలేదని, మహిళల భద్రతపై జాతీయ మహిళా కమిషన్ స్పందించాలని, కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నిరంగాల్లో పూర్తిస్థాయిలో విఫలం అయ్యారని విమర్శించారు. ఆదివాసీ మహిళ దారుణ అత్యాచారానికి గురై చావుబ్రతుకుల్లో ఉంటే పరామర్శించే మానవత్వం లేదా అంటు రేవంత్‌రెడ్డిని ప్రశ్శించారు. జైనూరు ఘటనలో బాధిత మహిళలకు తక్షణ న్యాయం జరగాలని, రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాగా, జైనూరు ఘటనలో నిందితుడికి వత్తాసు పలుకున్న వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ముఠాగోపాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment