సాక్షి, నల్లగొండ: రాష్ట్రంలో 10 వేల ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులు (పీఎస్ హెచ్‌ఎం) వస్తాయని ఎదురుచూస్తున్న టీచర్ల అశలు గల్లంతయ్యాయి. విద్యాశాఖలో పదోన్నతులు ప్రారంభిస్తే ఆ పోస్టుల్లో తమకు పదోన్నతి లభిస్తుందని ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సీనియర్ సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ) ఎదురుచూస్తుండగా ప్రభుత్వం జారీ చేసిన హేతుబద్దీకరణ ఉత్తర్వులు వారిని నిరాశలో ముంచేశాయి. 150 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకే ప్రధానోపాధ్యాయ పోస్టులు ఇస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడంతో పీఎస్‌హెచ్‌ఎం పోస్టుల వ్యవహారం గందగరగోళంలో పడింది. ఏం చేయాలన్న అర్థంకాని స్థితిలో అధికారులు పడ్డారు.
ఆ ప్రతిపాదనలు ఏమైనట్లు?
ఈ ఏడాది మార్చి నెలలో సమస్యలు, పీఆర్‌సీ వంటి అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా ప్రాథమిక పాఠశాల్లో 10 వేల హెచ్‌ఎం పోస్టులను ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు, వాటిల్లో ఇప్పటికే ఉన్న హెడ్‌మాస్టర్ పోస్టులు, ఇంకా ఎన్ని మంజూరు చేయాలన్న అంశాలపై వివరాలను సేకరించింది. ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 18,217 ప్రాథమిక పాఠశాలల్లో 4,429 లోఫిమేల్ లిటరసీ (ఎల్‌ఎఫ్‌ఎల్) హెడ్ మాస్టర్ పోస్టులు మంజూరైనవి ఉన్నట్లు తేల్చింది. సీఎం కేసీఆర్ 10వేల స్కూళ్లలో హెడ్ మాస్టర్ పోస్టులను ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో మరో 5,571 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంటుందని, ఏయే జిల్లాల్లో ఎన్ని పోస్టులను మంజూరు చేయాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది.
చదవండి: Gandhi Hospital: అదృశ్యమైన మహిళ సురక్షితం
ఆ ప్రతిపాదనలను పంపించి ఐదు నెలలు గడిచిపోయింది. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మంజూరైన 4,429 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టుల్లో ప్రస్తుతం2,386 మంది పనిచేస్తున్నట్లు కూడా తేల్చింది. 5,571 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేశాక ప్రస్తుతం ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పోస్టుల్లో ఉన్న ప్రధానోపాధ్యాయులను మినహాయించి మిగిలిన 2,043 పోస్టులు, కొత్త పోస్టులు కలుపుకొని మొత్తంగా 7,614 పోస్టుల్లో పదోన్నతులు ఇవ్వాలని విద్యాశాఖ భావించింది. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న ఎల్‌ఎఫ్‌ఎల్ పోస్టులకు అదనంగా సీఎం చేప్పిన 10 వేల పోస్టులను ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారం తేలకముందే ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన హేతుబద్దీకరణ ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధన వారి ఆశలపై నీళ్లు చల్లాయి. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఆలోచనలో పడ్డారు. సీఎం హామీ మేరకు తాము కొత్త పోస్టులను సృష్టించేందుకు ఫైలు పంపిస్తే వాటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోగా, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఏం చేయాలన్న గందరగోళంలో అధికారులు పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment