సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచార పర్వంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుసరించిన వాట్సాప్ గ్రూపుల విధానాన్ని.. ఇప్పుడు పోలీసులు ఎన్నికల బందోబస్తు, నిఘా కోసం అవలంబిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రం నుంచి వచ్చిన అదనపు బలగాలతోపాటు స్థానిక సిబ్బంది పనిని ఈ గ్రూపులతో పర్యవేక్షిస్తున్నారు.
పాయింట్ డ్యూటీలు, రూట్లలో ఉన్న సిబ్బంది తమ లొకేషన్, సెల్ఫీ ఫొటోలను గ్రూపుల్లో షేర్ చేయడాన్ని తప్పనిసరి చేశారు. ఇక బందోబస్తు, భద్రత విధుల్లో ఉన్న సిబ్బందికి ఇబ్బంది రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారికి బస, రవాణా, ఆహారం తదితరాల కోసం ఏర్పాట్లు చేశారు.
ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో..
ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ తరఫున ప్రచారం చేయడానికి, కాలనీలు, బస్తీల్లో జెండాలతో సంచరించడానికి చాలా మందిని నియమించుకున్నారు. వారికి రోజులు, వారాల లెక్కన చెల్లింపులు చేశారు. బృందాలుగా చేసి ప్రాంతాల్లో తిప్పారు. వారు తాము చెప్పిన చోటుకే వెళ్తున్నారా? స్థానికులను కలుస్తున్నారా? ప్రచారం చేస్తున్నారా? అన్నది పరిశీలించేందుకు వాట్సాప్ గ్రూపులను వాడారు.
క్షేత్రస్థాయిలో ఉన్నవారు ఎప్పటికప్పుడు తమ లొకేషన్లు షేర్ చేసేలా, ప్రజలతో సెల్ఫీలు దిగిపోస్ట్ చేసేలా చర్యలు చేపట్టారు. ఇదే వ్యూహాన్ని బందోబస్తు, భద్రత చర్యల కోసం వచ్చి న అదనపు బలగాలను పర్యవేక్షించడానికి పోలీసు ఇన్‌స్పెక్టర్లు వాడుతున్నారు. కేంద్రం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేక, సాయుధ బలగాలను పోలీసుస్టేషన్ల వారీగా కేటాయించారు. ఆయా పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్సెక్టర్లే వారి విధులను పర్యవేక్షించాలి.
ఎవరెవరు ఏ విధుల్లో ఉన్నారు? ఎక్కడ ఉన్నారన్నది సులువుగా తెలుసుకుని, పర్యవేక్షించేలా ఇన్‌స్పెక్టర్లు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. రూట్ పార్టీ ల్లో తిరుగుతున్న, పాయింట్ డ్యూటీల్లో ఉన్న సిబ్బంది కచ్చి తంగా తమ ఫొటోలు, లొకేషన్లను అందులో షేర్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు.
సిబ్బందికి ఇబ్బందులు లేకుండా..
బందోబస్తు విధులంటే పోలీసులకు ఇబ్బందే. తాగడానికి నీళ్లుండవు, ఆహారం ఉండదు. కేటాయించిన ప్రాంతాన్ని వదిలి కదలడానికి లేదు. రిపోర్ట్ చేసిన అధికారి కార్యాలయం నుంచి డ్యూటీ పాయింట్‌కు వెళ్లేందుకూ ఇబ్బందే. ఈసారి ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సిబ్బంది రిపోర్ట్ చేసిన ప్రాంతం నుంచి పాయింట్‌కు చేరడం కోసం, అవసరమైన పక్షంలో ప్రత్యేక గస్తీలు నిర్వహించడం కోసం వాహనాలు అద్దెకు తీసుకున్నారు. భోజనం, టీ, మంచినీళ్లుఅందేలా ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment