సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దంచికొట్టిన వానతో జనజీవనం స్తంభించి, పంటలన్నీ దెబ్బతిన్నాయి. నర్సంపేట డివిజన్‌లో కుండపోతగా రాళ్లవాన కురిసింది. ఇటుకాలపల్లి, అకులతండ, ఇప్పల్ తండ, నల్లబెల్లి, దుగ్గొండి ప్రాంతాల్లో కుండపోతగా కురిసిన రాళ్లవానతో అపార నష్టం సంభవించింది. గాలివాన వడగళ్లతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సప్లై నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది.
గాలివానతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఐస్ గడ్డలు పడ్డట్లు రాళ్లవాన కురిసింది. మిర్చి పత్తితోపాటు పండ్లతోటలకు అపార నష్టం వాటిల్లింది.వరద నీటితో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రాత్రిపూట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు.
సహాయక చర్యలకై అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రజలను కోరారు. హనుమకొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఆకస్మాత్తుగా కురిసిన వర్షంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
వరంగల్ నగరంలో రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల చిన్నసైజులో వడగళ్లు కూడా పడ్డాయి. విద్యుత్‌సరఫరాలో అంతరాయమేర్పడింది. వరద నీటితో డ్రెయినేజీ వ్యవస్థ స్తంభించడంతో రోడ్లపై నీరు నిలిచిపోయి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. వరంగల్ చౌరస్తా, బీటు బజారు, మేదరవాడ, అండర్ బ్రిడ్జి, తదితర రహదారుల్లో మోకాల్లోతు నీరు నిలిచిపోయింది.
వరంగల్ స్టేషన్‌రోడ్డు, జేపీఎన్ రోడ్డు, పోచమ్మమైదాన్ నుంచి ములుగు రోడ్డులో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు అసంపూర్తిగా ఉండటంతో వర్షం నీరు భారీగా నిలిచిపోయి వాహనదారులకు ఎటూ వెళ్లే మార్గం లేకుండా పోయింది. ప్రధాన జంక్షన్లు, రహదారుల్లో పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచిపోయింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని పలు లోతట్టు ప్రాంతాల్లో మోకాల్లోతు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment