నైరుతి సీజన్‌కు ముందే గ్రేటర్ హైదరాబాద్‌లో కుండపోత
గంట సేపట్లో సికింద్రాబాద్‌లో 11.6 సెం.మీ. వర్షపాతం
రాష్ట్రంలోని చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు
పిడుగులు పడి ముగ్గురు మృతి... మరో రెండ్రోజులు రాష్ట్రంలో వానలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్‌వర్క్: నైరుతి రుతుపవనాలు రాకముందే రాష్ట్రంలో భారీ వర్షం కురిసింది. గురువారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షం కురవగా... రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం వరకు ఎండవేడితో ఉక్కిరిబిక్కిరైన గ్రేటర్ ప్రజలకు మధ్యాహ్నం 3.30గంటల సమయంలో మొదలైన వాన ఉపశమనాన్ని ఇచ్చింది. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని గంటకుపైగా ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. కుండపోత వానతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ప్రధాన రహదారుల వెంట ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 11.6 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, కృష్ణానగర్‌లో 9, షేక్‌పేటలో 8.65, అంబర్‌పేట్‌లో 8.45, నాంపల్లిలో 8.3, ఖైరతాబాద్‌లో 7.73 సెం.మీ. నమోదైంది. హైదరాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. అదేవిధంగా సిద్దిపేట, కరీంనగర్, మెదక్, వనపర్తి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, మహబూబ్‌నగర్, జగిత్యాల, జనగామ, పెద్దపల్లి, సిరిసిల్ల, భువనగిరి, నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 199 ప్రాంతాల్లో ఒక సెంటీమీటర్ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది. సాధారణంగా మే నెల మధ్యలో ఇంత పెద్ద వాన కురవడం గత పదేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
మరో రెండు రోజులు..
తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఉపరితల ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు చెప్పింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు సైతం కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్, జనగామ, నాగర్‌కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం రాష్ట్రంలో చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో...
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దుబ్బాక మార్కెట్ యార్డులో తూకానికి సిద్ధం చేసిన 3 వేల క్వింటాళ్ల ధాన్యం, మిరుదొడ్డి, అక్బర్‌పేట–భూంపల్లి, ములుగు మండలాల పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. పాపన్నపేట మండలం ఆరెపల్లిలో పిడుగుపడి 10 మేకలు మృతి చెందాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో
ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. అడ్డాకుల, మిడ్జిల్, మూసపేట, ధరూర్, జడ్చర్ల, భూత్పూర్, వెల్దండ తదితర మండలాల్లో వర్షప్రభావం ఉంది. జడ్చర్ల మార్కెట్‌లో విక్రయానికి వచి్చన ధాన్యం, సరీ్వస్ రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసింది. ఈదురుగాలులకు పలుచోట్ల మామిడి తోటలకు నష్టం వాటిల్లింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్‌లో, బొమ్మలరామారంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల్లోకి వర్షపు నీరు చేరింది. తూకం వేసిన ధాన్యం బస్తాలు కూడా తడిసిపోయాయి. సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డలో ఈదురుగాలుల కారణంగా హోర్డింగ్ కూలిపోయింది.
పిడుగుపాటుతో ముగ్గురు మృతి
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని భరత్‌నగర్‌కు చెందిన రైతు రుద్రారపు చంద్రయ్య (42) పొలంలో సాగు చేస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మరణించాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన కంబోళ్ల శ్రీనివాస్ (32) చెట్టుపైకి ఎక్కి చింతకాయ తెంపుతుండగా పిడుగుపడి మృతిచెందాడు. చెట్టు కింద ఉన్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనివాస్‌కు తల్లిదండ్రులు, భార్య, మూడు నెలల కుమారుడు ఉన్నారు.
కడ్తాల్ మండలం కలకొండకు చెందిన కార్పెంటర్ పసునూరి ప్రవీణ్‌చారి (30) తన మామ నాగోజు జంగయ్యచారితో కలిసి పని నిమిత్తం బైక్‌పై కడ్తాల్ వచ్చారు. పని ముగించుకుని సాయంత్రం స్వగ్రామాలకు వెళ్తుండగా వాస్‌దేవ్‌పూర్ గేట్ వద్దకు చేరుకోగానే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. బైక్‌ను నడుపుతున్న జంగయ్య వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేశాడు. వెనకాల కూర్చున్న ప్రవీణ్ బైక్ దిగి బస్ షెల్టర్‌లోకి వెళ్తుండగా.. సమీపంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. జంగయ్యకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. జంగయ్యచారి కూతురు మౌనికతో ప్రవీణ్‌చారికి ఏడాది క్రితమే వివాహమైంది.
బుధవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లలో)
కేంద్రం గరిష్టం
ఆదిలాబాద్ 39.8
రామగుండం 39.0
నిజామాబాద్ 38.8
ఖమ్మం 38.4
భద్రాచలం 38.2
మహబూబ్‌నగర్ 38.1
నల్లగొండ 38.0
హన్మకొండ 36.0
హైదరాబాద్ 35.6
హకీంపేట్ 35.4
దుండిగల్ 35.2
మెదక్ 35.2
Comments
Please login to add a commentAdd a comment