ఎడతెరిపిలేని వర్షాలకు నీటమునిగిన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని చైతన్యపురి కాలనీ
సాక్షి, తెలంగాణ: ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రంలో ఊళ్లూ, వాగులూ ఏకమవుతున్నాయి. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వరదపోటుతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రధాన నదులతో పాటు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో ఊళ్లకు ఊళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ప్రాజెక్టులకు భారీగా నీరు చేరడం, చెరువులు, జలపాతాలకు వరద పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. చాలాచోట్ల రోడ్లు వరద తాకిడితో కోతకు గురయ్యాయి. ఇప్పటికే అత్యధిక వర్షపాతం నమోదుకాగా మరో మూడు రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగనున్నదని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్.. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిస్థితిపై ఆదివారం కూడా ప్రతి మూడు గంటలకో సారి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడుతూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా, జోరువానలతో గోదావరి, ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఉభయ నదులు 11.74 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాలైన ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ పరిధి జిల్లాలతో పాటు వరంగల్ మహానగరంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన విపత్తు సహాయక బృందాల (డీఆర్‌ఎఫ్)ను రంగంలోకి దింపారు. ప్రత్యేక బోట్లు, పంపులు, జనరేటర్లు, పోర్టబుల్ లైటింగ్ సిస్టమ్ కలిగి ఉన్న ఈ బృందాల్లోని 40 మంది సభ్యులు ఆదివారం వరంగల్ నగరపాలక సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సీఎం ఆదేశాలతో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు ఆదివారం క్షేత్రస్థాయిలో పర్యటించి, వరద ప్రాంతాల్లోని పరిస్థితిని సీఎంకు వివరించారు. మరోపక్క ములుగు జిల్లాలోని బొగత జలపాతానికి ఎత్తైన కొండలు, అడవుల నుంచి వరద నీరు పోటెత్తుతోంది.
భద్రాచలంలో ఉగ్ర గోదారి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉపనదుల ద్వారా గోదావరిలోకి భారీగా వరదనీరు చేరుతోంది. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55 అడుగులకు చేరింది. ఇది అర్ధరాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రవాహాలు ఉధృతమవుతుండటంతో 24 గంటల వ్యవధిలోనే వరుసగా మొదటి, రెండో, మూడో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. ఎగువన ఉన్న మేడిగడ్డ నుంచి భారీగా నీరు వదలడంతో ఇక్కడ ప్రవాహాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. భద్రాచలం దిగువన.. గోదావరిలో కలిసే శబరి సైతం ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గోదావరికి ఎగపోటు వేస్తోంది. ఇక, భద్రాచలం రామాలయం ప్రాంతంలో వరదనీరు భారీగా చేరుతోంది. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని గోదావరి పరీవాహక మండలాల్లో 120 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా, రోడ్లు దెబ్బతిన్నాయి.
గోదావరిలో కలిసే కిన్నెరసాని, తాలిపేరు, పెద్దవాగుల కింద గల ఊళ్లు నీటమునిగి దీవుల్లా మారాయి. అధికారులు ముంపు ప్రాంత ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద గోదావరి నుంచి సీతారామ ఎత్తిపోతల కెనాల్‌కు అడ్డుగా వేసిన కట్ట తెగిపోవడంతో కెనాల్‌లోకి భారీగా నీరు చేరింది. బీజీకొత్తూరు వద్ద సీతారామ మొదటి పంప్‌హౌస్ నీటితో నిండిపోయింది. కిన్నెరసానిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో దాని కింద గల 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి అప్రోచ్ రోడ్డు కుంగిపోగా అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేశారు. మున్నేరు, లంకాసాగర్, పాలేరు, వైరా రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరదలతో 10వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో పొంగి ప్రవహిస్తున్న మల్లన్నవాగు
పోటెత్తుతోన్న మూసీ
సూర్యాపేట జిల్లా సోలిపేట సమీపంలోని మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరద ఉధృతి పెరగడంతో ఆదివారం ఉదయం 10.30కి 22 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. రాజధానితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లాలోని బిక్కేరు, ఇతర వాగులు, వంకల నుంచి వస్తున్న వరద ప్రవాహాలతో మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 645 అడుగులు కాగా, ఆదివారం సాయంత్రానికి 643 అడుగుల మేర నీరు చేరింది. సూర్యాపేట మండలం కేటీ అన్నారం గ్రామ సమీపంలో మూసీలో చేపలు పడుతున్న ముగ్గురు యువకులు నదిలో చిక్కుకుపోగా, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కాపాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీకి అనుబంధంగా ఉన్న పలు కాలువలకు గండ్లుపడి పంటలు నీటమునిగాయి. జిల్లాలో 20 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లాలో ఏకధాటి వానతో చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి.
సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు 45 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అంచనా. వర్షం దెబ్బకు సింగరేణి ఓసీపీల్లో నాలుగు రోజులుగా రూ.41 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మూలవాగు, పెద్దవాగు, నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వేములవాడ బుడగ జంగాల కాలనీ వరదనీటిలో చిక్కుకున్న 22 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలకు పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. మిడ్‌మానేరులోకి 20 టీఎంసీలకుపైగా నీరు చేరింది. ఏ క్షణంలోనైనా గేట్లెత్తే అవకాశం ఉండటంతో మిడ్‌మానేరు, ఎల్‌ఎండీ మధ్య ఉన్న రైతులు వాగు వద్దకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
పాలమూరులో పోటెత్తిన కృష్ణమ్మ
కృష్ణానది నుంచి వస్తున్న వరదతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల, కోయిల్‌సాగర్, సరళాసాగర్, రామన్‌పాడు ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. ఆదివారం ఆయా ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదిలారు. నాగర్‌కర్నూల్ జిల్లా రాకొండలో మట్టి మిద్దె ఇల్లు కూలి తల్లి, కుమార్తె దుర్మరణం పాలయ్యారు. కోడేరు మండలం తీగలపల్లికి చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు.. బావాయిపల్లి వాగులో కొట్టుకుపోయింది. వెంటనే డోర్లు తెరుచుకుని కారులోని ఐదుగురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆసియాలోనే రెండోదైనా వనపర్తి జిల్లాలోని సరళాసాగర్ ప్రాజెక్టు సైఫన్లు ఆదివారం తెరుచుకున్నాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో..
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. హుస్నాబాద్ మండలంలో మూడేళ్ల తర్వాత చెరువులు నిండుకుండల్లా మారి మత్తడి పోస్తున్నాయి. సిద్దిపేట జిల్లా బస్వాపూర్ మోతిమొగ పెద్ద వాగులో లారీ కొట్టుకుపోయింది. గల్లంతైన డ్రైవర్ ముడిమాదుల శంకర్ (35) ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చి చేరుతుండగా, నిజాంసాగర్ ప్రాజెక్ట వెలవెలబోతోంది. కామారెడ్డి జిల్లాలో 20కిపైగా పూరిళ్లు వర్షాలకు నేలమట్టమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment