హుస్సేన్ సాగర్ నిండిపోవడంతో నీటిని విడుదల చేస్తున్న దృశ్యం
సాక్షి, నెట్‌వర్క్: మేఘం ఆగమాగం.. మన్నూ, మిన్నుకు ఏకధారగా కురిసిన ఎడతెరిపిలేని వర్షం.. ప్రజలను జడిపించింది. వాగులు, వంకలను ముంచెత్తింది. దీంతో పల్లెల మధ్య రాకపోకలు స్తంభించాయి. అల్పపీడనం అనల్ప ప్రభావం చూపింది. ఆసుపత్రులకు బయలుదేరిన నిండు గర్భిణులు వాగులు దాటలేక నరకయాతన పడ్డారు. స్కూలుకని వెళ్తున్న స్వీపర్ వరదనీటిలో గల్లంతయ్యాడు. చేపలవేటకు వెళ్లిన జాలరులపై జాలి కూడా చూపలేదు. రహదారులు కొట్టుకు పోయాయి.. కాలనీలు జలమయమయ్యాయి.. రాష్ట్రం మోస్తరు, భారీ, అతి భారీ వర్షాల సంగమ మైంది. రాష్ట్రంలోని 22 మండలాల్లో అతి భారీ, 43 మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో 14 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 11 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మొత్తానికి శనివారం కురిసిన భారీ వర్షానికి రాష్ట్రవ్యాప్త జనజీవనం అతలాకుతలమైంది.
మత్తడి దుంకుతున్న 500 చెరువులు
సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా నడిగూడెం మండలంలో 18.63 సెం.మీటర్ల వర్ష పాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 500 చెరువులు పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి. నడిగూడెం జలదిగ్బంధంలో చిక్కుకుంది. 30 ఏళ్ల తర్వాత నడిగూడెం చౌదరిచెరువు అలుగు పోస్తోంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్‌పల్లిలో వరి పొలాలు నీట మునిగాయి. గుండాల – నూనెగూడెంబ్రిడ్జి పైనుంచి వరద నీరు పారుతోంది. బీబీనగర్, పోచంపల్లి పరిధిలో మూసీకి వరద పోటెత్తుతోంది.
గల్లంతైన స్కూలు స్వీపర్
మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం గొండ్యాల వాగును దాటేందుకు ప్రయత్నించి స్కూల్ స్వీపర్ రాములు గల్లంతయ్యాడు. భూత్పూర్ మండలం పోతులమడుగు– గోపన్నపల్లి మధ్య కాజ్‌వేపై దాటుతున్న ఆటో వరద ఉధృతికి కొట్టుకుపోయింది. డ్రైవర్ ఊశన్న కిలోమీటర్ మేర వరద నీటిలో కొట్టుకుపోయి ఓ చెట్టు సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దేవరకద్ర మండలం కౌకుంట్లలో చేపల వేటకు వెళ్లిన ఇస్రంపల్లికి వెంకటేశ్ అనే యువకుడు వాగులో చిక్కుకోవడంతో స్థానికులు కాపాడారు. మహబూబ్‌నగర్‌లో నీట మునిగిన కాలనీల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పార పట్టి వరదనీటిని మళ్లించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 700 ఎకరాల్లో, వనపర్తి జిల్లాలో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. నారాయణపేట జిల్లాలో 114 చెరువులు నిండుకుండలా మారాయి.
మహబూబ్‌నగర్ జిల్లా పోతులమడుగు కాజ్‌వే వద్ద కాలువ ఉధృతికి నీటిలో కొట్టుకుపోతున్న ఆటో
వాననీటిలో ఆరుగురు లారీ డ్రైవర్లు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఖద్గాం క్వారీలోని మంజీరా నదిలో ఇసుక కోసం వెళ్లిన ఆరుగురు లారీ డ్రైవర్లు చిక్కుకున్నారు. స్థానికులు వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నిజాంసాగర్ మండలం సింగితం రిజర్వాయర్‌లో మూడు గేట్లను ఎత్తివేశారు. కౌలాస్ నాలా ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తడంతో పెద్దదడ్గి వాగు బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో బిచ్కుంద, బాన్సువాడ మండలాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి.
నీటి మునిగిన వరి పంట
కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలో వరి పంట నీటమునిగింది. బిక్కవాగు ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు ఇళ్లలోకి చేరింది. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం అర్కండ్ల వాగులో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన భూమయ్య త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
లోతట్టు జలమయం
మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి పంట నీట మునగడంతో రైతులు ఆవేదన చెందారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
నీట మునగడంతో వికారాబాద్ జిల్లా కాగ్నా బ్రిడ్జి వద్ద రాకపోకలు నిలిపివేసి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు
నిండుకుండల్లా జంట జలాశయాలు
రంగారెడ్డి జిల్లా నందిగామలో శనివారం 18.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 5 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు అంచనా. కోట్‌పల్లి, జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టులు అలుగు దూకుతున్నాయి. పరిగిలోని లక్నాపూర్ ప్రాజెక్టు ఉధృతంగా అలుగు పారుతోంది. హిమాయత్‌సాగర్, గండిపేటకు వరద నీరు పోటెత్తింది. వికారాబాద్ జిల్లాలోని కాగ్నా నది ఉధృతంగా ప్రవహించింది. ·వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ పరిధిలోని జంట జలాశయాలు(హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్) నిండుకుండల్లా మారాయి. ఎగువ ప్రాంతం నుంచి గంటగంటకూ హిమాయత్·సాగర్‌లోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ఏ సమయంలోనైనా గేట్లు తెరిచేందుకు· అధికారులు అక్కడే మకాం వేసి సిద్ధంగా ఉన్నారు. పదేళ్ల తర్వాత మళ్లీ గేట్లు ఎత్తనున్నారు. మూసీకి వరద ప్రవాహం పెరుగుతోంది.
గర్భిణులకు వరద కష్టాలు
కర్ణాటక రాష్ట్రం చించోళి తాలుకా ఈర్గుపల్లికి చెందిన నిర్మిలకు పురిటినొప్పులు రావడంతో తాండూరు ఆస్పత్రికి తరలిస్తుండగా బెల్కటూర్ వద్దకు రాగానే వాగు పొంగిపొర్లింది. దీంతో గ్రామస్తులు ఆమెను ఎత్తుకుని వాగు దాటించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గీకి చెందిన లాల్‌బీ అనే నిండుగర్భిణిని అంబులెన్స్‌లో బషీరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. గంగ్వార్– బషీరాబాద్ మధ్య చిన్న ఏరు పొంగింది. దీంతో అంబులెన్స్ అక్కడే నిలిచిపోయింది. స్థానికులు ఆమెను మంచంపై మోసి ఏరు దాటించారు.
బెల్కటూర్ వాగులో నుంచి గర్భిణిని వాగు దాటిస్తున్న స్థానికులు
హైదరాబాద్‌లో...
ఏకధాటిగా కురిసిన వర్షంతో హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వరదనీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మ్యాన్‌హోళ్లు నోళ్లు చెరుచుకున్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయంకావడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. బుల్కాపూర్ నాలా, షేక్‌పేట్ కొత్త చెరువు, గోల్కొండ శాతం చెరువులు పొంగిపొర్లాయి. మంగళ్‌హాట్‌లో ఒక ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. మీరాలంమండి వాననీటితో నిండిపోయింది.
50 మండలాల్లో 10 సెం.మీ.పైగా..
రాష్ట్రంలో మొత్తంగా 50 మండలాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. శనివారం రాష్ట్రంలో సగటు వర్షపాతం 4.45 సెంటీమీటర్లుగా నమోదైంది. ఈ సీజన్‌లో శనివారం నాటికి 106.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు లేవని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఆంద్రప్రదేశ్ తీరప్రాంతం గుండా అల్పపీడనం కొనసాగుతోందని, దీంతోపాటు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు, తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులపాటు తెలంగాణ అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment