వర్షం బీభత్సం: పంట పోయింది.. బురద మిగిలింది | Heavy Rain Tragedy In Karimnagar | Sakshi
Sakshi News home page

పంట పోయింది.. బురద మిగిలింది

Published Sun, Jul 25 2021 9:04 AM | Last Updated on Sun, Jul 25 2021 9:04 AM

Heavy Rain Tragedy In Karimnagar - Sakshi

సాక్షి, మంథని(కరీంనగర్‌): మంథని మండలం విలోచవరానికి చెందిన బండరవి 38ఎకరాల వరి సాగుచేశాడు. పంట కలుపుతీతకు వచ్చింది. నాట్లు వేసిన అనంతరం పొలాల వద్దకు వాహనాలు వెళ్లాలంటే దారి లేకపోవడంతో రూ.మూడు లక్షలు వెచ్చించి అవసరమైన ఎరువులు, క్రిమిసంహారక మందులు కొని పొలం వద్ద ఏర్పాటు చేసిన షెడ్డులో నిల్వ చేశాడు. అకస్మాత్తుగా గోదావరికి వరద రావడంతో ఎరువులన్నీ నీటిలో కరిగిపోయాయి. క్రిమిసంహారక డబ్బాలు కొట్టుకుపోయాయి. నాటు వేసిన పొలం ప్రస్తుతం బురద మాత్రమే మిగిలింది. ఇది కేవలం ఒక్క రవి ఆవేదన మాత్రమే కాదు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రతి రైతు దుస్థితి.

ఎడతెరపి లేని వర్షాలు.. ఉప్పొంగిన వరదలతో మంథని నియోజకవర్గ రైతులు తీవ్రంగా నష్టపోయారు. గోదావరి, మానేరుతీరం వెంట ఉన్న సుమారు ఐదు వేల ఎకరాల్లో వేసిన వరి, పత్తి, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం వరద ఉధృతి తగ్గడంతో మంథని వద్ద గోదావరి సాధారణ స్థితిలో ప్రవహించింది. పరీవాహక ప్రాంతాలైన సిరిపురం, పోతారం, విలోచవరం, కాసిపేట, ఉప్పట్ల, ఆరెంద, మల్లారంతోపాటు పలు గ్రామాల్లో రైతులు వేసిన పంట కొట్టుకుపోయింది. నీరు వెళ్లిపోవడంతో పంట పొలాలు తేలాయి. ఇసుక మేటలు, బురద మాత్రమే మిగిలింది.

లక్షల రూపాయల ఎరువులు వరద పాలు
మంథనితోపాటు జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు సరైన దారి ఉండదు. నాట్లు వేసేముందే సీజన్‌కు సరిపడా ఎరువులు నిల్వ చేసుకుంటారు. ఇలా మంథని ప్రాంతానికి చెందిన రైతులు సుమారు రూ.10లక్షల విలువ చేసే ఎరువులను నిల్వ చేసుకోగా.. గోదావరిలో కొట్టుకుపోయాయి. నష్టాన్ని అధికారులు అంచనా వేసి ప్రభుత్వం ఆధుకోవాలని రైతులు కోరుతున్నారు.

నిండా ముంచిన పోచంపల్లి చెక్‌డ్యాం బ్యాక్‌ వాటర్‌
కాల్వశ్రీరాంపూర్‌: ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని పోచంపల్లి వద్ద మానేరు నదిపై నిర్మించిన చెక్‌డ్యాం బ్యాక్‌వాటర్‌ ఉప్పొంగింది. పొలాల్లో ఇసుక మేటలు వేసింది. వేలాది రూపాయిలు పెట్టుబడి పెట్టి నాట్లు వేశామని, ఇంతలోనే బ్యాక్‌వాటర్‌తో నామరూపాలు లేకుండా పోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్‌ అధికారులు బ్యాక్‌ వాటర్‌ పొలాల్లోకి రాకుండా కట్ట నిర్మించలేదని, ఇప్పుడు తీవ్రంగా నష్టపోయారని సర్పంచు నాగార్జున్‌ రావు, ఎంపీటీసీ జనార్దన్‌ రెడ్డి, రైతులు ఆరోపించారు. సంబంధిత అధికారులు సర్వే చేసి కట్ట నిర్మాణం చేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement