నిజామాబాద్ నగర శివారు పాంగ్రా గ్రామంలో నీట మునిగిన ఇళ్లు
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్‌వర్క్: నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ వానలు జోరందుకున్నాయి. చాలా చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోత వానలు నమోదవుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి. పలుచోట్ల రోడ్లపై రాకపోకలు స్తంభించిపోయాయి. అయితే వాన నిలకడగా కురుస్తుండటంతో పెద్దగా ఇబ్బంది ఎదురుకావడం లేదని అధికారవర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఈ వర్షాలు ఇంకో రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
నిజామాబాద్‌లో దంచికొట్టిన వాన
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. డిచ్‌పల్లి మండలం నడిపల్లిలో హైదరాబాద్ రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. సిరికొండ మండలంలో కప్పలవాగు ఉధృతికి గడ్కోల్–నిజామాబాద్ మార్గంలో రాకపోకలు నిలిపోయాయి. సిరికొండలో విద్యుత్ ఉపకేంద్రం నీట మునిగింది. నిజామాబాద్ శివార్లలోని పాంగ్రాలో పలు ప్రాంతాలు నీట మునగడంతో నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
రెంజల్ మండల కేంద్రంలో మూడు ఇళ్లు కూలిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని పెద్దవాగు పొంగి పోచారం ప్రాజెక్టు అలుగు పోస్తోంది. మంజీరా పరవళ్లు తొక్కుతుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. వాగులు ఉప్పొంగడంతో గాంధారి–బాన్సువాడ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. లింగంపేట, తాడ్వాయి, రాజంపేట, సదాశివగనర్, మాచారెడ్డి మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
వికారాబాద్ జిల్లాలో పొంగుతున్న వాగులు
భారీ వర్షాలతో వికారాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వికారాబాద్, తాండూరు, పరిగిలలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొత్రెపల్లి – బురంతపల్లి మార్గంలో రోడ్డు కోతకు గురైంది. జిల్లాలోని ప్రమాదకర వాగులు, బ్రిడ్జీల వద్ద నిఘా ఉంచారు. కాగ్నా, మూసీ, ఈసీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక మెదక్ ఉమ్మడి జిల్లా పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. వాగులు ఉప్పొంగడంతో సింగూరు ప్రాజెక్టులోకి వరద పెరిగింది.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో విస్తారంగా..
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు విస్తారంగా వానలు పడ్డాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో చెట్లు విరిగిపడ్డాయి. ఖానాపూర్ మండలంలో రెంకోనివాగు ఉప్పొంగి కడెం, దస్తురాబాద్, ఖానాపూర్ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
హైదరాబాద్‌ను వీడని వాన
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సోమవారం పొద్దంతా ఎడతెరిపి లేకుండా వానపడింది. పలు ప్రాంతాల్లో కాసేపు భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. ఇళ్లలోకి వరద చేరింది. పలు భవనాల సెల్లార్లు నీట మునిగాయి. రోడ్లపై వరద కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు.
నగరంలో మియాపూర్‌లో అత్యధికంగా 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బీహెచ్‌ఈఎల్ 3.9, హైదర్‌గూడలో 3.8, చందానగర్, లింగంపల్లి, 3.7, గచ్చిబౌలిలో 3.5, రాంచంద్రాపురం, మాదాపుర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో 3 సెంటీమీటర్లకుపైగా వానలు పడ్డాయి.
పంటలకు ప్రాణం వచింది
గత నెల రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, సోయా, కంది తదితర పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. అలాంటిది రెండు రోజులుగా కురుస్తున్న వానలతో పంటలకు ప్రాణం పోసినట్లు అయిందని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న వరి పంటకు సైతం ఈ వర్షాలు కీలకమని అంటున్నారు.
మరో రెండు రోజులు వానలు
వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజులుగా వానలు కురుస్తున్నాయి. ఇదే ఆవర్తనం ప్రభావంతో.. మంగళవారం వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
► మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబుబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
► ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది.
2.7 సెంటీమీటర్ల సగటు వర్షపాతం
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 2.7 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా సగటును పరిశీలిస్తే.. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 8.72 సెంటీమీటర్లు కురిసింది. నిర్మల్‌లో 8.4, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8.0, కామారెడ్డి జిల్లాలో 7.1, జగిత్యాలలో 6.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ప్రాంతాల వారీగా చూస్తే.. రాష్ట్రంలోనే అత్యధికంగా కామారెడ్డి జిల్లా గాంధారిలో 10.05 సెంటీమీటర్ల వాన పడింది.
► నైరుతి రుతుపవనాల సీజన్‌కు సంబంధించి రాష్ట్రంలో సోమవారం (సెపె్టంబర్ 4) నాటికి 59.77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. ఈసారి ఇదే సమయానికి 69.13 సెంటీమీటర్లు కురిసింది. అంటే సాధారణం కంటే 16శాతం అధిక వర్షపాతం కొనసాగుతోందని వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి.
► మొత్తంగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అధికంగా, 20 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా.. ఖమ్మం జిల్లాలో మాత్రం 17శాతం లోటు వర్షపాతం కొనసాగుతోంది.
రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలివీ (సెం.మీ.లలో)
ప్రాంతం (జిల్లా) వర్షపాతం
గాంధారి (కామారెడ్డి) 10.05
లక్ష్మీసాగర్ (సంగారెడ్డి) 8.98
కొండాపూర్ (సంగారెడ్డి) 8.88
మోమిన్‌పేట్ (వికారాబాద్) 7.73
సంగారెడ్డి (సంగారెడ్డి) 7.63
చిటు్కల్ (మెదక్) 7.60
వికారాబాద్ (వికారాబాద్) 7.45
నవాబ్‌పేట్ (వికారాబాద్) 7.35
పుల్కల్ (సంగారెడ్డి) 7.00
పల్డా (నిజామాబాద్) 6.70
ఆరు గంటల పాటు వరద మధ్య..
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పేట్ సంగెం, రాంలక్ష్మన్‌పల్లి గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు అవతల మాతుసంగెం గ్రామానికి చెందిన సంగయ్యకు పొలం ఉంది. సోమవారం ఉదయం పొలం వద్ద కట్టేసిన గేదెలను తీసుకురావడానికి వెళ్లిన సంగయ్య.. ఒక్కసారిగా పెద్దవాగు ప్రవాహం పెరగడంతో మధ్యలో చిక్కుకుపోయాడు. దీనిపై సమాచారం అందడంతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, కలెక్టర్ జితేష్ పాటిల్, ఇతర అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా నుంచి బోటు తెప్పించారు. సుమారు ఆరు గంటల పాటు వరదలో బిక్కుబిక్కుమంటూ గడిపిన సంగయ్యను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment