సాక్షి, హైదరాబాద్ : కులాంతర వివాహం చేసుకున్న పాపానికి హత్యకు గురైన హేమంత్ సోదరుడు సుమంత్ యూకే నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. అన్న మృతి తట్టుకోలేక విలవిల్లాడిపోయాడు. వదిన అవంతిని పట్టుకుని బోరున విలపించాడు. తన అన్నను చంపిన వారిని ఎవరిని వదలనని, వారందరినీ కఠినంగా శిక్షించాలని సుమంత్ డిమాండ్ చేశాడు. హత్య జరిగే రెండు రోజుల ముందు అన్నయ్య తనకు ఫోన్ చేశాడని, బిజినెస్ సంబంధించిన పలు అంశాలపై చర్చించామని తెలిపాడు. కులాంతర వివాహం చేసుకున్నందుకే తన అన్నను అతి కిరాతంగా హత్య చేశాడని, చెప్పులతో కొట్టుకుంటూ మరీ తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు హేమంత్ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని చందానగర్ శ్మశాన వాటికలో శనివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. (మరో ‘పరువు’ హత్య)
అంత్యక్రియల సమయంలో హేమంత్ భార్య అవంతి, తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. తన కొడుకు కన్నా ముందు నన్ను పాడె మీద పడుకోబెట్టండి అంటూ హేమంత్ తల్లి పాడే మీద పడుకోబోయింది. ఒక్కసారి కళ్ళు తెరువు హేమంత్ అంటూ భార్య అవంతి రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మరోవైపు ఈ హత్యలో ప్రధాన సూత్రధారి యుగేందర్ రెడ్డితోపాటు 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా కూతురు ప్రేమ వివాహాన్ని జీర్ణించుకోలేని అమృత తండ్రి కిరాయి హంతకుడితో ఆమె భర్త ప్రణయ్‌ను హత్య చేయించిన ఘటన మరువకముందే.. మరో పరువు హత్య జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment