
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని కోకాపేట, ఖానామెట్‌లోని ప్రభుత్వ భూముల్ని వేలం వేయడాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌లో తుది విచారణకు లోబడి ఆ వేలం ప్రక్రియ ఉంటుందన్న ఆదేశాలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అటువంటి ఆదేశాలు ఇస్తే కొనేవారు భయపడతారని, అలాగే తక్కువ ధరను కోట్ చేస్తారని, తర్వాత ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరుగుతుందని అభిప్రాయపడింది. అయితే ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ భూములను వేలం వేయాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎంపీ ఎం.విజయశాంతి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ఆక్రమణల నుంచి కాపాడలేక, నిధులను సమకూర్చుకునేందుకు ఈ భూముల్ని వేలం వేస్తున్నామని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు.
ప్రభుత్వమే కాపాడలేకపోతే ఎలా ?
‘ఆక్రమణదారుల నుంచి కాపాడలేక ప్రభుత్వ భూముల్ని వేలం ద్వారా విక్రయిస్తున్నామని ప్రభుత్వం పేర్కొనడం ఆశ్చర్యకరం. ప్రభుత్వమే తన భూముల్ని కాపాడుకోలేకపోతే ఇక ప్రజల భూముల్ని ఏం కాపాడుతుంది. భూముల్ని కాపాడేందుకు వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేయండి. ప్రతి జిల్లాకు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఒకవైపు చెబుతున్నారు. మరోవైపు ఉన్న భూముల్ని వేలం ద్వారా విక్రయిస్తున్నారు. ప్రభుత్వం తానిచ్చిన ఆదేశాల అమలులో పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వేలం ప్రక్రియను ఎలా సమర్థించుకుంటుంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి’అని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 8కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment