హైదరాబాద్: వరదలపై నివేదికను సమర్పించిన ప్రభుత్వంపై న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. రూ.500 కోట్ల పరిహారంలో ఎవరికి ఎంత సహాయం చేశారో వివరాలు సరిగా లేవని తెలిపింది. రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరదలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను పేర్కొంటూ నివేదికను న్యాయస్థానానికి ప్రభుత్వం తరపు న్యాయవాది సమర్పించారు. నేడు దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.
అయితే.. రూ.500 కోట్లు రూపాయలు పునరావాసం కోసం కేటాయించినట్లు ప్రభుత్వం రిపోర్ట్ లో పేర్కొంది. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అయితే.. రెండో సారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని వాదనలు వినిపించిన పిటిషనర్ తరుపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్.. వరద ప్రభావం , నష్టంపై మరో నివేదిక మెమోను న్యాయస్థానానికి సమర్పించారు.
అంటువ్యాధులతో భాదపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద నివారణ, బాధితులకు సహాయం, పరిహారం అందజేత లాంటి వివరాలపై శాశ్వత నివారణ చర్యలు ఏం చేపట్టారో వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. రాష్ట్రంలో జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదంటూ డాక్టర్ చెరుకు సుధాకర్ 2020లో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
తాజా వర్షాలు, వరదల నేపథ్యంలో దీనికి సంబంధించి ఓ మధ్యంతర అప్లికేషన్ (ఐఏ) దాఖలైంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టుకు ఓ నివేదికను సమర్పించింది. దీనిలో రూ.500 కోట్లను నష్టపరిహారంగా బాధితులకు పంచినట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలకు 240 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 6,443 ఇళ్లకు పాక్షిక నష్టం వాటిల్లింది. 1,59,960 ఎకరాల్లో పంటలు వరద బారిన పడ్డాయని తెలిపింది. ఈ మేరకు తాజాగా పూర్తి నివేదిక న్యాయస్థానం ముందు పెట్టింది.
ఇదీ చదవండి: Telangana Floods: సహాయక చర్యలేం చేపట్టారు..?
Comments
Please login to add a commentAdd a comment