
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం అమలు మార్గదర్శకాలపై సందిగ్ధత వీడలేదు. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి దశకు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల ఎంపికకు సంబంధించి ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఎస్సీ కార్పొరేషన్‌లో అయోమయం నెలకొంది. వీలైనంత త్వరగా మార్గదర్శకాలు జారీ చేయాలని ఇప్పటికే ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రభుత్వాన్ని కోరింది.
ప్రభుత్వం 2022–23 బడ్జెట్‌లో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ లెక్కన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 1,500 యూనిట్లు చొప్పున మంజూరు చేస్తూ కేటాయింపులు చూపింది. కానీ తొలుత ఒక్కో నియోజకవర్గానికి 500 యూనిట్లు మంజూరు చేయాలంటూ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు ఎస్సీ కార్పొరేషన్ చర్యలు మొదలుపెట్టగా న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో ప్రక్రియ నిలిచిపోయింది. లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సిఫారసును హైకోర్టు ఆక్షేపించింది. ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా అర్హులైన వారిని ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేయాలని సూచించడంతో లబ్దిదారుల ఎంపికకు ఇప్పటివరకు అనుసరించిన విధానాన్ని నిలిపివేయాలని స్పష్టం చేసింది.
జాడలేని మార్గదర్శకాలు
ఎమ్మెల్యేల సిఫారసు ద్వారా కాకుండా లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తామని ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు సూచించింది. ఈ క్రమంలో ఎంపిక విధానానికి సంబంధించిన పలు సూచనలను అధికారులు ప్రతిపాదించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణ, అర్హతలు, ఎంపిక ప్రక్రియ తదితర అంశాలతో కూడిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. మరోవైపు దళితబంధు అమలుకు ప్రత్యేకంగా యాప్, వెబ్‌పోర్టల్‌ను సైతం అధికారులు రూపొందించారు.
పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన వెంటనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయలేదు. ప్రస్తుతం 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం కొనసాగుతోంది. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఆలోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి నిధులు విడుదల చేయాలి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ లబ్దిదారుల ఎంపికకు కనిష్టంగా 2 నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈక్రమంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకుంటే ఈ ఏడాది దళితబంధు లబ్దిదారుల ఎంపిక కష్టమని అంటున్నారు.