
పరీక్షల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
సన్నద్ధతకు సమయం ఇవ్వలేదన్న పిటిషనర్లు.. పరీక్షల వాయిదాసరికాదన్న ఏఏజీ రజనీకాంత్
10 మంది కోసం పరీక్షలు ఆపడం సమర్థనీయంకాదని వెల్లడి
మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ పరీక్షలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు ఇప్పటికే మొదలైనందున జోక్యం చేసుకోలేమని.. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. తుది ఉత్తర్వుల మేరకు ఫలి తాలు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరినా కుదరదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ఫిబ్ర వరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువా రం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 5 వరకు సాగనున్నాయి.
అయితే సన్నద్ధతకు సరిగ్గా సమయం ఇవ్వకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారని, స్టే ఇవ్వాలని కోరు తూ వికారాబాద్ జిల్లా నాగులపల్లికి చెందిన రాంపల్లి అశోక్‌తోపాటు మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయ వాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం సమయం ఇవ్వకుండా అత్యవసరమన్నట్లు డీఎస్సీ నిర్వహి స్తోందన్నారు.
సన్నద్ధతకు సరైన సమయం ఇవ్వని కారణంగా చాలామంది టీచర్ పోస్టు పొందలేకపోయే ప్రమాదం ఉందని చెప్పారు. 2022 నుంచి పిటిషనర్లు గ్రూప్–1, గ్రూప్–2తోపాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహి స్తున్న పలు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారన్నారు. ఈ కారణంగా డీఎస్సీకి సిద్ధం కావడానికి తగిన సమయం లేకుండా పోయిందని చెప్పారు. డీఎస్సీ పరీక్షలపై స్టే విధించి సన్నద్ధకు సమయం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టొదు: ఏఏజీ
ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, గురువారం నుంచి ప్రారంభమయ్యాయని చెప్పారు. దాదాపు 2.5 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారన్నారు. 10 మంది కోసం లక్షల మంది జీవితాలను ఫణంగా పెట్ట వద్దని కోరారు. 81.5% మంది పరీక్ష లకు హాజరవుతున్నారన్నారు.
పిటిషనర్లు ఏయే పరీక్షలకు హాజరయ్యారు.. వారి హాల్‌టికెట్ల వివరాలు సమర్పించలేదని పేర్కొన్నారు. పరీక్షను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ డీఎస్సీ పరీక్షలకు వర్తించదని వెల్లడించారు. తుది తీర్పు మేరకు ఫలితాలు వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల న్యాయవాది విజ్ఞప్తి చేయగా.. ఏఏజీ అభ్యంతరం చెప్పారు.
ఇప్పటికే పలు పరీక్షల రద్దుతో నిరుద్యోగులు విసిగిపోయారని, తుది తీర్పు మేరకే ఫలితాల వెల్లడి అంటే వారు మరింత నిరుత్సాహంలో కూరుకుపోతారన్నారు. ఏఏజీ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ.. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment