మహావేగంగా దూసుకొచ్చిన గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటుకొనేందుకు అన్ని ప్రధాన పార్టీలు సమరానికి సన్నద్ధమవుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం తదితర పార్టీలన్నీ బరిలోకి దింపేందుకు కార్పొరేట్ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేపట్టాయి. టీఆర్‌ఎస్ ఇప్పటికే రెండు జాబితాలను ప్రకటించింది. అన్ని పార్టీల్లోనూ ఆశావహుల సందడి నెలకొంది. ఎన్నికలకు గడువు లేకపోవడంతో ఎలాంటి జాప్యానికి తావులేకుండా అభ్యర్థులను ప్రకటించి ప్రచారపర్వంలోకి దిగేందుకు రాజకీయ పార్టీలు కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నేర చరితులను పోటీకి దూరంగా ఉంచాలని, గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం కష్టపడే వారిని మాత్రమే బరిలో నిలపాలని పౌరసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌లు డిమాండ్ చేస్తున్నాయి.
– సాక్షి, సిటీబ్యూరో
సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించాలి:
అధికార టీఆర్‌ఎస్ నుంచి 16 మంది కార్పొరేటర్లు, ఎంఐఎం నుంచి 13 మంది, బీజేపీ నుంచి ఒక్కరు చొప్పున నేరచరిత్ర కలిగిన వాళ్లు ఉన్నట్లు ఫోరమ్ ఫర్ గుడ్‌గవర్నెన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన వాళ్లు పోటీ చేయడం వల్ల ఓటర్లలో విముఖత ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తులకు ఓటు వేసేందుకు వెనకడుగు వేస్తారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్రను పత్రికల్లో తప్పనిసరిగా ప్రచురించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలు చేయాలి. సచ్ఛీలురను పక్కనపెట్టి నేరచరిత కలిగిన వాళ్లకు ఎందుకు టికెట్‌లు ఇవ్వాల్సి వచ్చిందో కూడా పార్టీలు 48 గంటల్లో స్పష్టం చేయాలి. అలాగే నేరచరిత కలిగిన వ్యక్తుల గొప్పతనం, వారిని నిలబెట్టేందుకు దోహదం చేసిన సద్గుణాలు, అర్హతలను కూడా వివరించాలి. సుప్రీం కోర్టు ఆదేశాలను అన్ని రాజకీయ పార్టీలు అమలు చేయాలి. చదవండి: ఈ ఎన్నికల్లో వారికే ఓటు వేద్దాం..
గత ఎన్నికల్లో ..
గత గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన వారిలో 72 మందికిపైగా వివిధ పోలీస్‌స్టేషన్‌లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వారిలో 30 మంది గెలిచారు. అంటే 20 శాతం మంది కార్పొరేటర్లు నేరచరిత కలిగిన వారే కావడం గమనార్హం.
మార్పు అవసరం...
ప్రస్తుత ఎన్నికల్లోనైనా నేరచరిత కలిగిన వారిని పక్కనపెట్టాలని ప్రజాస్వా మ్య సంస్థలు కోరుతున్నాయి. ఒకవేళ నేరచరిత కలిగిన వాళ్లు పోటీ చేస్తే వారు సమర్పించే అఫిడవిట్‌లో 6ఏ నిబంధన ప్రకారం తప్పనిసరిగా వారిపై నమోదైన కేసుల వివరాలను కూడా స్పష్టంగా పేర్కొనాల్సిఉంటుంది. గెలుపు గుర్రాల పేరిట నేరస్తులను బరిలో నిలపడం వల్ల హైదరాబాద్ నగర అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే వాళ్లకు, ఉత్తమ రాజకీయ చరిత్ర కలిగిన వాళ్లకు అవకాశం లేకుండాపోతోందని వివిధ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
ఈసీకి ఎఫ్‌జీజీ వినతి..
నేరచరిత లేని వ్యక్తులకే ప్రాధాన్యమిచ్చేలా రాజకీయ పార్టీలపైన ఒత్తిడి తేవాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరుతోంది. మరోవైపు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కోరుతూ ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment