
సాక్షి, హైదరాబాద్: పల్లెరోగులకు సేవలందించిన సంచార వైద్యవాహనం ఇక కనుమరుగు కానుంది. ‘104’వైద్య సంచార వాహన సేవలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అక్కడే నెలనెలా వైద్యపరీక్షలు నిర్వహించి, నెలకు సరిపడా మందులను ఒకేసారి ఇచ్చేందుకు ప్రభుత్వం ‘104’వాహనసేవలను ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే.
ప్రతినెలా 20వ తేదీ వరకు నిర్దేశిత గ్రామాల్లో ఈ వాహనాలు సంచరిస్తుంటాయి. ఆ సంచార వైద్యవాహనంలో వైద్యుడు, ఏఎన్‌ఎం, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, సహాయకుడు ఉంటారు. ఈ పథకాన్ని నిలిపివేయాలని నిర్ణయించిన వైద్య ఆరోగ్యశాఖ, అందులో పనిచేస్తున్న దాదాపు 1,250 మంది ఉద్యోగులను ఆ శాఖలోనే ఇతర పథకాల పరిధిలో సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే అమలులో ఉన్న జీవనశైలి వ్యాధుల నివారణ పథకం ద్వారా ఇంటింటికీ మందులను సరఫరా చేస్తున్నారు. మరోవైపు, త్వరలో పల్లె దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించడంతో ‘104’సేవలను నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment