సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధినాయకత్వం ‘మిషన్ తెలంగాణ’ను టాప్‌గేర్‌లోకి తీసుకెళ్లనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న చిరకాల కోరికను సాధించేందుకు దృష్టి కేంద్రీకరిస్తోంది. అలాగే, రాష్ట్రంలో మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఈ నెల 19న ప్రధాని మోదీ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతోపాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని, వైఫల్యాలను ఎండగట్టనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
దీనికి కొనసాగింపుగా ఈ నెల 28న పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపార్టీ సంస్థాగతంగా ఏ మేరకు ఎన్నికలకు సన్నద్ధమైందో పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బూత్ కమిటీలు, మండల, ఇతరస్థాయిల కమిటీల నియామకం తదితర విషయాలపై సమీక్షిస్తారు. అవసరమైతే అమిత్‌షా 29వ తేదీ కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నాలుగేసి లోక్‌సభ నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్‌గా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. అమిత్‌షా కనీసం రెండు క్లస్టర్ సమావేశాల్లో పాల్గొని సంస్థాగతంగా ఎన్నికల సన్నద్ధతను పర్యవేక్షించనున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల కసరత్తు షురూ
వచ్చే డిసెంబర్‌లోగా ఎప్పుడైనా ఎన్నికలు ఉండొచ్చనే అంచనాల మధ్య బీజేపీ కసరత్తును ముమ్మరం చేసింది. ఎన్నికల సన్నద్ధతపై తాజాగా ఆరెస్సెస్ జాతీయ నాయకత్వం నుంచి బీజేపీ జాతీయ, రాష్ట్రనాయకత్వాలు సలహాలు తీసుకున్నాయి. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను తీవ్రస్థాయిలో ఎండగట్టడంతోపాటు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మరింత సమన్వయంతో పనిచేయాలని ఆరెస్సెస్ సూచించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో పారీ్టకి సంబంధించిన వివిధస్థాయిల నాయకులు, లోక్‌సభ నియోజకవర్గస్థాయి కమిటీలకు బుధ, గురువారాల్లో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్రపార్టీ సంస్థాగత ఇన్‌చార్జి సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేయనున్నారు. వివిధ వర్గాల ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వతీరును, ముఖ్యమైన హామీలను నిలబెట్టుకోకపోవడాన్ని ఎండగట్టేలా భవిష్యత్ కార్యాచరణకు తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించారు.
దీంతోపాటు సంస్థాగతంగా పార్టీ పటిష్టత, పోలింగ్ బూత్ స్థాయి వరకు వివిధ కమిటీల బలోపేతం, ప్రజాసమస్యల పరిష్కారం తదితర అంశాలపై దృష్టి పెట్టనున్నారు. అలాగే, బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగే పార్లమెంటు ప్రభారీ, విస్తారక్ సమావేశంలోనూ బన్సల్ పాల్గొంటారని రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.
ప్రభారీలు, కన్వీనర్ల నియామకం
రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్లమెంటరీ ప్రభారీలు, కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లుగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నియమించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు వీరు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
నడ్డా సమక్షంలో పొంగులేటి చేరిక
ఫిబ్రవరి తొలి వారంలో బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరనున్నట్టు పారీ్టవర్గాల సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్యనేతల సమక్షంలో ఆయన బీజేపీలో అధికారికంగా చేరేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ నాయకత్వంపై నేరుగా విమర్శలు గుప్పించడం, వచ్చే ఎన్నికల్లో తానే కాదు తన అనుయాయులంతా పోటీచేస్తారంటూ తాజాగా పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 18న ఢిల్లీలో అమిత్‌షా, జేపీ నడ్డా ఇతర ముఖ్యనేతలను పొంగులేటి కలుసుకుంటారని చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారపారీ్టతోపాటు అన్ని పారీ్టల నాయకులు, కార్యకర్తలతో పొంగులేటికి సత్సంబంధాలు ఉన్నందున ఆయన చేరికతో బీజేపీ పూర్తిస్థాయిలో బలం పుంజుకుని మెజారిటీ సీట్లలో గెలుపొందుతుందనే విశ్వాసాన్ని బీజేపీ ముఖ్యనేతలు వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment