
కొండ కింద పార్కింగ్‌లో వాహనాల రద్దీ. (ఇన్‌సెట్‌లో) ప్రధానాలయంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి కార్తీకమాసంతో పాటు ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రి నుంచే భక్తుల రాక మొదలైంది. ఆదివారం ఉదయమే కార్తీకమాసం సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రతాలు, దీపారాధనలకు క్యూకట్టారు. అనంతరం కొండపైన స్వయంభూలను దర్శించుకునేందుకు వెళ్లారు.
దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ధర్మ దర్శనానికి 5 గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. ఒక్కరోజే నిత్య ఆదాయం రికార్డుస్థాయిలో రూ.85,62,851 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, రద్దీ నేపథ్యంలో కొండపైకి, కిందికి బస్సులు ఆలస్యంగా నడవడంతో భక్తులు ఘాట్ రోడ్డు నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. బ్రేక్ దర్శనాల కోసం భక్తులను నిలిపివేయడంతో కొండపైన, కొండ కింద భక్తులు క్యూలైన్లలో 3 గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రసాద విక్రయ శాల వద్ద తోపులాట జరిగింది.