ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: అతని వయసు 50 సంవత్సరాలు. నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. రెండో పెళ్లి కోసం తన ప్రొఫైల్‌ని ఓ మాట్రిమోనియల్ సైట్‌లో పోస్ట్ చేశాడు. కట్ చేస్తే ఓ అందమైన 23 ఏళ్ల యువతి ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ పెట్టింది. అమ్మాయి కావడంతో యాక్సెప్ట్ చేసి మాట కలిపాడు. తాను నగరంలోని ఓ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో ఫైనలియర్ చదువుతున్నానని పరిచయం చేసుకుంది.
మీ ప్రొఫైల్‌ని ‘మాట్రిమోనియల్’ సైట్లో చూశాను..నాకు నచ్చారని చెప్పింది. అందమైన యువతి తనకు తానే పలకరించడంతో ఆ వ్యక్తి పరవశించిపోయాడు. ఇద్దరి మధ్య కొద్దిరోజుల పాటు సాన్నిహిత్యంగా బాగా సాగింది. నాకంటే మీరు 25 ఏళ్లు వయసులో ఎక్కువ అయినా..మీ ఆచారాలు, పద్ధతులు నచ్చి ఇష్టపడ్డానన్నది. ఈలోపే ఇతగాడు ఆ యువతితో ప్రేమలో పడ్డాడు. నిమిషాల కొద్దీ కాల్స్..గంటల కొద్దీ చాటింగ్ నడిచింది. సడన్‌గా ఒకరోజు ఫైనలియర్ ఫీజుకు డబ్బు అవసరమని కోరింది. కొంత ఇచ్చాడు.
ఆ తర్వాత కోవిడ్ వచ్చిందని ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యానని చెప్పింది. మరో రూ.10 లక్షలు ఇచ్చాడు. కొద్దిరోజులు గడిచాక మా అమ్మకు కోవిడ్ వచ్చిందని చెప్పి మరో రూ.10 లక్షలు లాగేసింది. తన లగ్జరీ ఖర్చులు, ఇతర అవసరాల కోసం అతగాడి నుంచి పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.46 లక్షలు కాజేసింది. ఇన్ని లక్షలు పోగొట్టుకున్నాక గానీ ఆ వ్యక్తి తాను మోసపోయానని గుర్తించలేకపోయాడు. చివరకు తేరుకుని శుక్రవారం సిటీ సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు.
చదవండి👉 ‘మామూలు’ ఇస్తే.. ఆ ఒక్కటీ సరైపోతుందని హింట్
Comments
Please login to add a commentAdd a comment