ఓల్వో కార్ల పేరుతో మోసాలు.. కటకటాల్లోకి సాకేత్‌ తల్వార్‌ | HYD Police Arrrest Talwar Group MD Saket Talwar In Cheating Case | Sakshi
Sakshi News home page

ఓల్వో కార్ల పేరుతో మోసాలు.. కటకటాల్లోకి సాకేత్‌ తల్వార్‌

Published Tue, Aug 10 2021 7:50 AM | Last Updated on Tue, Aug 10 2021 8:04 AM

HYD Police Arrrest Talwar Group MD Saket Talwar In Cheating Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖరీదైన ఓల్వో కార్లు కొంటామంటూ నకిలీ పత్రాలు సమర్పించి వివిధ బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల్ని వరుసపెట్టి మోసాలు చేస్తున్న తల్వార్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ సాకేత్‌ తల్వార్‌ ఎట్టకేలకు పట్టుబడ్డారు. కొన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఇతడి ఆచూకీని గోవాలో కనిపెట్టిన నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు. ఇతడితో పాటు ఇతడి కంపెనీపై మొత్తం ఎనిమిది కేసులు ఉన్నాయని, కెనరా బ్యాంకు ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అరెస్టు చేశామని సోమవారం సీసీఎస్‌ సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి వెల్లడించారు.

నగరంలోని ఎస్‌ఏయూవీఈ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు అభిసుబ్రమణ్యం, జ్యోతి గుత్తా, డి.శ్రీచరణ్, పి.శ్రీనివాస్‌ గౌతమ్‌ డైరెక్టర్లు. ఓల్వో కంపెనీకి చెందిన ఎక్స్‌ సి 90 కారు కొనడానికి రూ.95 లక్షల రుణం కోసం సుల్తాన్‌బజార్‌లోని కెనరా బ్యాంకు బ్రాంచ్‌లో 2018లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ రుణం మంజూరు చేసిన ఆ బ్యాంకు టోలీచౌకిలోని తల్వార్‌ కార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో చెక్కును జారీ చేసి, దరఖాస్తుదారులకు సదరు కారు ఇవ్వాలని సూచించింది.

ఎస్‌ఏయూవీఈ సంస్థకు ఆ కారు డెలివరీ చేసినట్లు.. తమకు మొత్తం ర. 95 లక్షలు ముట్టినట్లు నకిలీ పత్రాలు సృష్టింన తల్వార్‌ కార్స్‌ బ్యాంకునకు వాటిని సమర్పింంది. రుణం పొందిన ఎస్‌ఏయూవీఈ సంస్థ నెలసరి వాయిదాలు చెల్లించలేదు. దీంతో అధికారులు సదరు ఓల్వో కారు వివరాలను ఆర్టీఏ విభాగం నుంచి సేకరించడానికి ప్రయత్నించారు. తమ వద్ద అలాంటి కారు రిజిస్టర్‌ కాలేదంట వారి నుంచి సమాధానం వచ్చింది. దీంతో తల్వార్‌ కార్స్‌తో పాటు ఎస్‌ఏయూవీఈ సంస్థ కుమ్మక్కై పథకం ప్రకారం తమను మోసం చేసినట్లు కెనరా బ్యాంకు అధికారులు గుర్తించారు. 

దీనిపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో సాకేత్‌ తల్వార్‌తో పాటు ఎస్‌ఏయూవీఈ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు అభిసుబ్రమణ్యం, జ్యోతి గుత్తా, డి.శ్రీచరణ్, పి.శ్రీనివాస్‌ గౌతమ్‌లపై కేసు నమోదైంది. ఈ తరహాలోనే బంజారాహిల్స్‌ కేంద్రంగా పని చేసే రెబెల్‌ మోటార్‌ సైకిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో, తల్వార్‌ కార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఐడీబీఐ బ్యాంక్‌ అనుబంధ సంస్థను మోసం చేసిన వ్యవహారం పైనా సీసీఎస్‌లో మరో కేసు నమోదై ఉంది. 2018లో చోటు చేసుకున్న ఈ రెండు సందర్భాల్లోనూ నిందితు లు ఓల్వో కారు ఖరీదు పేరుతో నకిలీ పత్రాలు సమరి్పంచి రుణం తీసుకుని మోసం చేయడం గమనార్హం.

సీసీఎస్‌లో నమోదైన రెండు కేసులతో పాటు బంజారాహిల్స్‌ ఠాణాలో మూడు, పంజగుట్ట, జూబ్లీహిల్స్, మియాపూర్‌లలో ఒక్కోటి చొప్పున కేసులు నమోదై ఉన్నాయి. దీంతో సాకేత్‌ తల్వార్‌ కొన్నాళ్లుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కెనరా బ్యాంకు ఫిర్యాదు మేరకు సీసీఎస్‌లో నమోదైన కేసును దర్యాప్తు చేసిన టీమ్‌–10 ఎస్సై కె.రామకృష్ణ గోవాలోని ఆరంబోల్‌ బీచ్‌లో ఉన్న మావి విల్లాలో అతడి ఆచూకీ కనిపెట్టారు. అతడిని అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement