Special Instructions Of Hyderabad Police To The Public, Ahead Of Sankranthi Vacation - Sakshi
Sakshi News home page

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!

Published Mon, Jan 11 2021 2:16 PM | Last Updated on Mon, Jan 11 2021 3:12 PM

HYD Police Instructions For Those Who Go To Sankranthi - Sakshi

సాక్షి, సైబరాబాద్‌: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్ళే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణీ ప్రియదర్శిని, ఐపీఎస్ అన్నారు. ‘సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని,  ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణీ ప్రియదర్శిని, ఐపీఎస్ ప్రజలకు పలు సూచనలు చేశారు. చదవండి: ఆ జంటకు కాలనీవాసులే కళ్లయ్యారు

సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు..
► సైబరాబాద్ కమిషనరేట్‌లో పోలీసులు నిఘానేత్రం కింద ప్రజలు, కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ సహకారంతో ఇప్పటికే సీసీటీవీ లను ఇన్ స్టాల్ చేశారు. తద్వారా ఎన్నో సంచలనాత్మక నేరాలను ఛేదించారు. ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్‌ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. 
►ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటివారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి.
►విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు.
►ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు.
► బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి.
►ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్‌ కర్టెన్‌ వేయాలి.
► గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.
►ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్‌, పాల వారిని రావద్దని చెప్పాలి.
►పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి.
►విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను  ఇతరులకు చెప్పకూడదు.
► విలువైన వస్తువుల సమాచారాన్ని ఇతరులకు చెప్పకూడదు. 

(చదవండి: సంక్రాంతి సెలవుల తర్వాత స్కూల్స్‌ రీఓపెన్‌)

►ఆరుబయట వాహనాలకు హాండిల్‌ లాక్‌తో పాటు వీల్‌ లాక్‌ వేయాలి. వాచ్ మెన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. 
► ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. 
 ► టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి. 
►బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి. బ్యాగు బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరిస్తారు. 
►ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. 
►హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా లైవ్/ప్రత్యక్షంగా చూసుకునే వీలుంది. ఇంటికి సంబంధించిన నాణ్యమైన సిసిటివి  లు (షాయోమీ వంటి కంపెనీలు తక్కువ ధరకే) ఆన్లైన్/ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. హోమ్ సెక్యూరిటీ సర్వెలెన్స్ కు ఇవి ఎంతో ఉపయుక్తం. 
►ఇంటి భద్రతాపరంగా ఇంటికి దృఢమైన, నాణ్యమైన తలుపులతో పాటు హై ఎండ్ గోద్రెజ్ హై సెక్యూరిటీ లాక్ సిస్టం ని వాడడం మంచిది. 
►తాళం వేయడం కంటే గోద్రెజ్ డోర్ లాక్ చేయడం వల్ల ఇంట్లో మనుషులు ఉన్నారా? లేరా? అనేది తెలియదు.
►సొంత ఇల్లు అయినట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి గ్రిల్స్ అమర్చుకోవడం ద్వారా రెండంచెల భద్రతనిస్తుంది. 

►ఇంట్లో, ఇంటి బయట మోషన్ సెన్సర్ లను ఉపయోగించడం మంచిది. ఇంటి బయట మోషన్ సెన్సర్ లైట్లను ఉపయోగించండి. ఇవి చీకటి ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తాయి. సెన్సార్లు పరిసరాల్లో ఏదైనా కదలిక గుర్తించగానే లైట్ వెలుగుతుంది. 
► సాధారణంగా సరైన భద్రతా ప్రమాణాలు పాటించని ఇండ్లు, చీకటి ప్రదేశం, పాత గ్రిల్స్‌, బలహీనమైన తాళాలు ఉన్న ఇండ్లలో దొంగలు పడే అవకశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలి. 
►ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. పోలీసు స్టేషన్‌ నెంబర్, వీధుల్లో వచ్చే బీట్‌ కానిస్టేబుల్‌ నెంబర్‌ దగ్గర పెట్టుకోవాలి. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం.
►అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
► ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు పక్కల వారికి లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలి. 
► నమ్మకమైన సెక్యూరిటీ గార్డులను, వాచ్ మెన్ ను నియమించుకోవాలి.
►కాలనీవాళ్లు కమిటీలు వేసుకొని వాచ్‌మెన్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకకోవాలి. 

► రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వచ్చినా వారి వివరాలు తెలుసుకుని రిజిస్టర్‌లో నమోదు చేసుకోవడం మంచిదని అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌లకు తెలపాలి.
►ఎప్పుడు కూడా స్థానిక పోలీసు స్టేషన్‌ నెంబర్‌ దగ్గరుంచుకోవడం మంచిది.
►దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్‌ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారులకు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 
►కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి. ఈ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్‌ లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్‌ నెంబర్‌ 9490617444 కు సమాచారం ఇవ్వాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement