సాక్షి, బంజారాహిల్స్: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 600 మంది బైక్ రేసర్లలో అత్యుత్తమ ప్రతిభ చాటిన నగర యువకుడు నాలుగు విభాగాల్లో ముందుండి నాలుగు ట్రోఫీలను కైవసం చేసుకున్నాడు. పూణేలోని లోనావాలాలో జరిగిన డ్రాగ్ రన్‌లో పాల్గొన్న కూకట్‌పల్లికి చెందిన బైక్ రేసర్ సందీప్ నడింపల్లి ఎం–9 కేటగిరిలో మొదటి స్థానం, ఓ–2 కేటగిరిలో మూడో స్థానంతో పాటు ఫాస్టెస్ట్ బైక్ ఆఫ్ ద ఈవెంట్, ఫాస్టెస్ట్ టైమ్ ఆఫ్‌ద ఈవెంట్ పతకాలను గెలుచుకున్నాడు. తొమ్మిది సెకండ్లలో 400 మీటర్ల దూరాన్ని చేరుకొని ఈ రికార్డు సృష్టించాడు.
అయిదేళ్లుగా రేసర్‌గా రాణిస్తున్న సందీప్ ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 50 పతకాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే నేషనల్ చాంపియన్‌గా నిలిచిన ఆయన పాత రికార్డులను బద్దలుకొట్టి నాలుగు సరికొత్త రికార్డులను నమోదు చేశారు.
మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన ఇతను కాలేజీ స్థాయిలోనే జాతీయ స్థాయి టైటిల్స్ సాధించాడు. మూడేళ్లలో ఆరు నేషనల్ టైటిల్స్, 45 ట్రోఫీలు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో మరింత రాణించి భారత కీర్తి పతాకాలను ప్రపంచ స్థాయిలో చాటాలన్నదే తన లక్ష్యమని ఆ మేరకు శ్రమిస్తానని సందీప్ తెలిపారు. ఈ పతకాలు రావడంపట్ల తనకెంతో ఆనందంగా ఉందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment