తప్పతాగి పోలీసులనే భయపెడున్న డ్రైవర్లు! | Hyderabad: Drunk Man Hitting Police With Vehicles | Sakshi
Sakshi News home page

ఖాకీలనే భయపెడుతున్న డ్రంకన్‌ డ్రైవర్లు

Published Mon, Mar 29 2021 8:11 AM | Last Updated on Mon, Mar 29 2021 10:07 AM

Hyderabad: Drunk Man Hitting Police With Vehicles - Sakshi

రెండు నెలల క్రితం మియాపూర్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ రమేష్‌ డీడీ తనిఖీల్లో ఉన్నప్పునడు వనస్థలిపురం పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ కారులో వస్తున్నాడు. అయితే పోలీసులను గమనించిన అతను వేగంగా వాహనాన్ని నడుపుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎస్‌ఐ రమేష్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతని వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఐపీసీ 332 సెక్షన్‌ కింద కేసు నమోదుచేసి జైలుకు తరలించారు.  

గత నెలలో జేఎన్టీయూ రోడ్డులో ఓ ద్విచక్ర వాహనదారుడు వేగంగా దూసుకువచ్చి పోలీసులకు దొరక్కుండా తప్పించుకునే క్రమంలో ట్రాఫిక్‌ ఎస్‌ఐను ఢీకొట్టడంతో కాలు విరిగి ఆస్పత్రి పాలయ్యాడు.

కేపీహెచ్‌బీ కాలనీ నిజాంపేట రోడ్డులోని కొలన్‌ రాఘవరెడ్డి గార్డెన్‌ సమీపంలో శనివారం రాత్రి 11.40 గంటలకు ట్రాఫిక్‌ పోలీసులు డీడీ తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో అతిగా మద్యం సేవించి కారులో అతివేగంతో వచ్చిన డ్రైవర్‌ సృజన్‌ హోంగార్డు ప్రహ్లాద్‌తో పాటు అక్కడే నిలిచి ఉన్న మహిళను ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకొని అక్కడికొచ్చిన ఏఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి అక్కడి ట్రాఫిక్‌ పోలీసులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న క్రమంలో మరోకారులోవచ్చిన ట్సాక్సీ డ్రైవర్‌ అస్లామ్‌ అతివేగంతో వచ్చి ఢీకొట్టాడు. దీంతో ఎగిరిపడిన మహిపాల్‌రెడ్డి రోడ్డు పక్కనే ఉన్న రాయికి తగిలి కాలు విరిగింది. తలకు తీవ్రగాయాలయ్యాయి.  

చదవండి: మందుబాబు దూకుడు.. పోలీసుల్నే 'ఢీ' కొట్టాడు

..ఈ మూడు ఘటనలే కాదు...రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు చేపడుతున్న ప్రత్యేక డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు ఒక్కొసారి వారి ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తున్నాయి. రాత్రి పది దాటిన తర్వాత వివిధ ప్రాంతాల్లో డీడీ తనిఖీలు చేస్తున్న వీరు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నా...డ్రంకన్‌ డ్రైవర్లు తమను పట్టుకుంటే జరిమానాతో పాటు జైలుకు పంపిస్తారని తప్పించుకునే క్రమంలో ఎదురుగా ఉన్న సిబ్బందిని ఖాతరు చేయకుండా దూసుకెళుతున్నారు.

ఫలితంగా పోలీసులు గాయపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇటువంటివారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపుతున్నా అడపాదడపా జరుగుతున్న ఈ ఘటనలు పోలీసులను కలవరపెడుతున్నాయి. ఓవైపు కరోనా నిబంధనలు పాటిస్తూ...మరోవైపు బారికేడ్లతో రహదారిని దిగ్బంధం చేసి డీడీ తనిఖీలు చేస్తున్న పోలీసులు అడపాదడపా కొంతమంది డ్రంకన్‌ డ్రైవర్లు చేస్తున్న చేష్టలతో భయపడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.  

► ఇక డీడీ తనిఖీల సమయంలో పోలీసులు కొన్ని నిబంధనల్ని విస్మరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  
►వాహనచోదకుడు ఆయా పరిస్థితుల్ని బట్టి కచ్చితంగా వాహనాన్ని స్లో చేసుకునే స్ట్రాటజిక్‌ పాయింట్స్‌ (రోడ్డు, బ్రేకర్లు, టర్నింగ్‌ పాయింట్లు) వద్ద డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడితే కొంత ఉపయోగం ఉంటుంది. కానీ అలా జరగడం లేదు. 
►వాహనచోదకులను ఆపేందుకు రహదారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటుచేస్తున్నా...వాటి రక్షణలో పోలీసులు ఉండడం లేదు. కొన్నిచోట్లు బారికేడ్ల కన్నా ముందుకెళ్లి వాహనచోదకులను ఆపుతున్న సందర్భాలున్నాయి.  
►వాహనచోదకులు హెల్మెట్‌ వాడినట్టుగానే డీడీ తనిఖీల్లో పాల్గొనే ట్రాఫిక్‌ పోలీసులు వైట్‌ క్యాప్‌లు ధరించాలి. దీనివల్ల కొంత ప్రమాదం తప్పే అవకాశం ఉంది. 

నిబంధనల మేరకు చర్యలు 
డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీ సమయంలో నిబంధనల ప్ర కారం ఏమేమి రక్షణ చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం. పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు వాహనదారులు అతిగా వ్యవహరిస్తే ఐపీసీ 333 సెక్షన్‌తో పాటు మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ ప్రకారం ఇతర చర్యలు తీసుకుంటున్నాం. మందుబాబుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. 
– విజయ్‌కుమార్, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement