సాక్షి, హైదరాబాద్: నగరంలోని సర్కారు బడులకు మహర్దశ పట్టనుంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, మౌలిక సదుపాయాల కల్పనకు రంగం సిద్ధమైంది. మన బస్తీ–మన బడి కార్యక్రమం కింద మొదటి విడతగా ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులను సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు వీటిని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
845 పాఠశాలల్లో..
గ్రేటర్ పరిధిలో మన బస్తీ– మన బడి, కార్యక్రమం కింద మొదటి విడతలో కింద సుమారు 845 పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ జిల్లాలోని పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 పాఠశాలల్లో, రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 1300పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 464 పాఠశాలల్లో, మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో 505 పాఠశాలలు ఉండగా అందులో 142 పాఠశాలల్లో పనులు చేపట్టనున్నారు.
విద్యార్థుల సంఖ్య అనుగుణంగా..
మొదటి విడతలో అత్యధిక విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యమిచ్చి ఎంపిక చేశారు. 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టారు. పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన గదులను తొలగించి వాటి స్థానంలో కొత్త గదులను నిర్మించడం, ప్రహరీ గోడలు, కిచెన్ షెడ్లు, డైనింగ్ నిర్మాణాలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణాలు, మరమ్మతులు, భవనాలకు రంగులు వేయడం, ఫర్నిచర్ ఏర్పాటు, గ్రీన్ చాక్‌బోర్డులు, డైనింగ్ హాల్, డిజిటల్ పరికరాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టారు. మూడేళ్ల ప్రాజెక్టులో భాగంగా మొదటి విడుతగా గుర్తించిన పాఠశాలల్లో పనులు చేపట్టినంతరం రెండో విడత కింద మరికొన్ని పాఠశాలలను ఎంపిక చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment