సాక్షి, హైదరాబాద్: రియల్ ఎస్టేట్ సంస్థల లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. ఈడీ అధికారుల బృందాలు శనివారం హైదరాబాద్‌లోని సాహితీ ఇన్‌ఫ్రాటెక్, దాని అనుబంధ సంస్థల కార్యాలయాలు, ఆ సంస్థ కీలక వ్యక్తుల ఇళ్లతోపాటు కంపెనీ కీలక ప్రమోటర్ అయిన బి.లక్ష్మి నారాయణ ఇంట్లోనూ ఈడీ సోదాలు కొనసాగినట్టు సమాచారం. హైదరాబాద్ సీసీఎస్‌తోపాటు పలు పోలీస్‌స్టేషన్లలో లక్ష్మినారాయణ, సాహితీ గ్రూప్‌నకు చెందిన మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ప్రీలాంచ్ ఆఫర్ల పేరిట కంపెనీ పలువురిని మోసగించినట్టు తెలుస్తోంది.
అమీన్‌పుర్ వెంచర్‌కు సంబంధించి దాదాపు 46 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్టు సమాచారం. అమీన్‌పుర్‌లో సాహితీ గ్రూప్‌నకు చెందిన శ్రావణి ఎలైట్‌పైనే ఎక్కువ ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. 38 అంతస్థుల భవనాల్లో ఫ్లాట్లను ప్రీలాంచ్ పేరిట విక్రయించారని, అసలు ఈ భవనాలకు హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అనుమతులు సైతం లేవని దర్యాప్తు అధికారులు గుర్తించారని తెలిసింది. ఇప్పటికే ఈ కేసులలో మనీలాండరింగ్ గుట్టురట్టు చేసేందుకు ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. మరో రియల్ ఎస్టేట్ కంపెనీ ఫీనిక్స్ గ్రూప్ సంస్థల్లోనూ శనివారం ఈడీ అధికారుల సోదాలు కొనసాగినట్టు సమాచారం. మొత్తం ఏడు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్టు తెలిసింది.
సాహితీ, ఫీనిక్స్ మధ్య లావాదేవీలు జరిగినట్టు గుర్తింపు!
అమీన్‌పూర్ ల్యాండ్ కేసులో సాహితీ, ఫీనిక్స్ మధ్య లావాదేవీలు జరిగినట్టుగా ఈడీ అధికారులకు ఆధారాలు లభించినట్టు తెలిసింది. ఓమిక్స్ ఇంటర్నేషనల్ కంపెనీలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినట్టు సమాచారం. ఫార్మా కంపెనీల్లోనూ ఈడీ అధికారుల సోదాలు కొనసాగినట్టు తెలిసింది. ఈడీ అధికారులు శనివారం పల్సస్ ఫార్మా కంపెనీతోపాటు ఆ కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు చేసినట్టు తెలిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పటాన్‌చెరు, మాదాపూర్‌ల్లో ఈ సోదాలు కొనసాగినట్టు తెలిసింది. ప్రధానంగా నగదు లావాదేవీలపైనే ఈడీ అధికారులు దృష్టి పెట్టినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment