మాదాపూర్: పన్నుల చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని సరైన మార్గంలో నడిపించే బాధ్యత సీఏలపై ఉంటుందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో శుక్రవారం ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ)సంస్థ ఆధ్వర్యంలో సీఏ విద్యార్థుల కోసం అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు.
ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన గవర్నర్ మాట్లాడుతూ సీఏలు అందరూ తమ వృత్తిలో నిజాయితీగా, పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఆదాయపు పన్ను పత్రాలను, లెక్కలను అర్థం చేసుకోవడం ఒకప్పుడు ఎంతో కష్టంగా ఉండేదని, కానీ కేంద్ర ప్రభుత్వం పన్ను విధానాన్ని సరళతరం చేయడంతో సులువుగా మారిందన్నారు. పన్నుల చెల్లింపుల విషయంలో ప్రజలకు ఉండే అపోహలను, భయాలను తొలగించి వారు పన్నులను సక్రమంగా చెల్లించే విదంగా సీఏలు పనిచేయాలన్నారు.
ఐసీఏఐ అధ్యక్షుడు డేబాసిస్ మిత్ర మాట్లాడుతూ ఐసీఏఐలో దాదాపు 325000 మంది సభ్యులు ఉన్నారని, 8 లక్షల మంది విద్యార్థులు సీఏ కోర్సు చదువుతున్నారన్నారు. చార్టర్డ్ అకౌంట్ రంగంలో వస్తున్న మార్పులు, సవాళ్లు వంటి అంశాలపై విద్యార్థులకు, వృత్తి దారులకు అవగాహన కల్పించేందుకు ప్రతి యేటా సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఐ ఉపాధ్యక్షుడు అనికేత్ సునీల్ తలాటి, ప్రతినిధులు దయా నివాసశర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment