సాక్షి, సిటీబ్యూరో: వరుస వర్షాలతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్ దిగువ ప్రాంతంలోని బస్తీలు, మూసీ పరిసర ప్రాంతాల బస్తీలు, కాలనీల్లోని ప్రజలు ఏ క్షణం ఎలాంటి సంఘటన జరగనుందోననే ఆందోళనతో వణికిపోతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో హుస్సేన్‌సాగర్ జలాశయం నిండిపోయింది.
చదవండి: హైదరాబాద్ పరిధిలో 68% అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ?
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్)513.41 మీటర్లుకాగా, సోమవారానికి ఎఫ్‌టీఎల్‌ను మించి 513.45 మీటర్లకు చేరుకుంది. మంగళవారం 513.46మీటర్లకు, బుధవారం మధ్యాహ్నానికి 513.49 మీటర్లకు చేరుకోవడంతో తూములద్వారా నీరును దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.ట్యాంక్‌బండ్ కింద ఉన్న తూములు పూడికతో మూసుకుపోవడంతో నీరు సాఫీగా వెళ్లేందుకు వాటిని తొలగించడం సర్‌ప్లస్ వెయిర్ (అలుగు)నుంచి సైతం నీరు వెళ్లేలా చెత్తాచెదారాల తొలగింపు వంటి చర్యలు చేపట్టారు.
భయం.. భయంగా..
♦ఒకేసారి భారీ మొత్తంలో వరదనీరు కిందకు చేరితే దిగువ ప్రాంతాల్లోని కవాడిగూడ, అశోక్‌నగర్, నాగమయ్యకుంట, సబర్మతీనగర్ తదితర బస్తీల్లోకి నీరు చేరే ప్రమాదం పొంచి ఉంది. దీంతో ఆ ప్రాంతాల ప్రజలు ఆందోళన చేరుతున్నారు. వదలని ముసురుతో సాగర్‌లో నీటిమట్టం ఏమాత్రం తగ్గలేదు. ఈ బస్తీలే కాక నగరంలోని వివిధ లోతట్టు ప్రాంతాల్లోనూ, మూసీ పరిసర ప్రాంతాల్లోనూ నీరు నిలిచిపోయే పరిస్థితి ఉండటంతో దాదాపు 150 బస్తీల ప్రజలు ఎప్పుడేం జరుగుతుందోనని వణికిపోతున్నారు.
♦ఓవైపు నానిన గోడలు కూలే ప్రమాదాలు పొంచిఉన్నాయి. లోతట్టు బస్తీలైన అంబర్‌పేట నియోజకవర్గంలోని పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్, నరసింహబస్తీ, సంజయ్‌గాంధీనగర్, విజ్ఞాన్‌పురి, బతుకమ్మకుంట, మలక్‌పేట పరిసరాల్లోని న్యూశంకర్‌నగర్, గంగానగర్, అన్నపూర్ణనగర్, పూల్‌బాగ్, కాలాడేరా, కమలానగర్, మూసానగర్, మూసారాంబాగ్, ఇందిరానగర్, శంకేశ్వరబజార్, ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
♦ఎప్పుడు వర్షాలొచ్చినా తీవ్రప్రభావం చూపించే పాతబస్తీలోని సిద్దిఖీనగర్, అమన్‌నగర్, భవానీనగర్, రహ్మత్‌నగర్, మౌలాకాచిల్లా, ముర్తుజానగర్, ఫరత్‌నగర్‌లతోపాటు గోల్కొండ పరిసరాల్లోని తాఖత్‌బౌలి, సజ్జద్ కాలనీ, నయీం కాలనీ, సాలేహ్‌నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్‌మక్తా, సికింద్రాబాద్‌లోని బ్రాహ్మణవాడి, రసూల్‌పురా , తదితర ప్రాంతాల్లోని బస్తీల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలా వివిధ బస్తీల్లోని దినసరి కూలీలు తదితరులు ఓవైపువర్షాల వల్ల కూలి పనుల్లేక, మరోవైపు ముంపు ముప్పుతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తూముల ద్వారా నీరు విడుదల..
హుస్సేన్‌సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రత్యేకంగా గేట్లు అంటూ లేవని హుస్సేన్‌సాగర్‌పై తగిన అవగాహన ఉన్న ఇంజినీర్లు తెలిపారు. వారి సమాచారం మేరకు, హుస్సేన్‌సాగర్‌కు నాలుగు ప్రధాన తూములు, రెండు అలుగులు ఎప్పటినుంచో ఉన్నాయి. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో పూడుకుపోయాయి. మ్యారియట్ హోటల్ దగ్గర, బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ దగ్గర అలుగులున్నాయి. ట్యాంక్‌బండ్ మధ్యన తూములున్నాయి. మరమ్మతులు లేక సవ్యంగా నీరు పారడం లేదు. మ్యారియట్ హోటల్‌వైపు ఉన్న తూము నుంచి అవసరమైన సమయాల్లో ఎక్కువ నీటిని దిగువకు విడుదల చేసేందుకు ప్రస్తుత సీఎస్ సోమేశ్‌కుమార్ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటునే చాలామంది గేట్లు తెరిచారంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment