![Hyderabad Kims Doctors Save Covid Infected Boy After 65 Days Of Life Support Therapy - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/25/SRISYLAM.jpg.webp?itok=Sw1JP9wQ)
సాక్షి, హైదరాబాద్: పన్నెండేళ్ల బాలుడు. కరోనా సోకింది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ తీవ్రమైంది. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. మూత్రపిండాలు, కాలేయం పనితీరు దెబ్బతింది. రక్తంలోనూ ఇన్‌ఫెక్షన్ సోకింది. ఇలాంటి పరిస్థితుల్లో బాలుడిని కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు కాపాడారు. దాదాపు 65 రోజులు ఎక్మోపైనే ఉంచి చికిత్స చేశారు. ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా మెరుగుపరిచి డిశ్చార్జ్ చేశారు.
చాలా రోజులు మంచానికే పరిమితం కావడంతో కదలికల్లేకుండా ఉన్న శరీరభాగాలను పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు ఫిజియోథెరపీకి పంపారు. చికిత్సకు సంబంధించిన వివరాలను కిమ్స్ సీఈవో అభినయ్ బొల్లినేని, ఊపిరితిత్తుల మార్పిడి నిపుణుడు డాక్టర్ సందీప్ అత్తావర్, పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్, ఫిజిషియన్ బీపీసింగ్ శుక్రవారం విలేకరులకు వివరించారు. చిన్నపిల్లలు ఎక్మోపై సుదీర్ఘకాలం ఉండి కోలుకోవడం అరుదైన అంశమని, ఇది ఆసియాలోనే మొదటిదని వైద్యులు వెల్లడించారు.
లక్నో నుంచి నగరానికి..
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన శౌర్య (12) సెప్టెంబర్ రెండో వారంలో కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం తల్లిదండ్రులు స్థానిక మిడ్‌లాండ్ హెల్త్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో చేర్చారు. తీవ్రమైన నిమోనియా వల్ల శ్వాస తీసుకోవడం కష్టమైంది. అప్పటికే బాలుడి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది.
కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలని మెరుగైన వైద్యం కోసం నగరంలోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులను బాలుడి తల్లిదండ్రులు ఆశ్రయించారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. డాక్టర్లు చికిత్సకు అంగీకరించడంతో ప్రత్యేక విమానంలో వెంటిలేటర్ సపోర్టుతో సెప్టెంబర్ 25న సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించారు.
ఫిజియోథెరపీ అవసరమవడంతో..
వీనోవీనస్ ఎక్మో సపోర్ట్‌తో బాలుడికి వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. అప్పటికే మూత్రపిండాల పనితీరూ దెబ్బతినడంతో డయాలసిస్ చేశారు. కాలేయ పనితీరూ దెబ్బతింది. రక్తంలో ఇన్‌ఫెక్షన్ లెవల్స్ ఎక్కువయ్యాయి. యాంటిబయాటిక్ మందులు వాడి ఇన్‌ఫెక్షన్ రేటును తగ్గించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 65 రోజులు ఎక్మోపై ఉంచి వైద్యసేవలు అందించారు.
సుదీర్ఘకాలం వైద్యసేవల తర్వాత బాలుని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. చాలా రోజులు మంచానికే పరిమితకావడం వల్ల కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాల కదలికల్లేకపోవడంతో ఫిజియోథెరపీ ద్వారా అవయవాలను పూర్వ స్థితికి తీసుకురావాలని భావించారు. ఆ మేరకు రెండ్రోజుల క్రితం అతన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి స్థానికంగా ఉన్న ఓ రిహాబిలిటేషన్ సెంటర్‌కు సిఫార్సు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment