ఏటా మరఠ్వాడ ముక్తి దిన్‌ ఉత్సవాలు :మహారాష్ట్ర సీఎం శిందే | Hyderabad Liberation Day: Maharashtra CM Eknath Shinde | Sakshi
Sakshi News home page

ఏటా మరఠ్వాడ ముక్తి దిన్‌ ఉత్సవాలు :మహారాష్ట్ర సీఎం శిందే

Published Sun, Sep 18 2022 1:18 AM | Last Updated on Sun, Sep 18 2022 7:46 AM

Hyderabad Liberation Day: Maharashtra CM Eknath Shinde - Sakshi

మాట్లాడుతున్న ఏక్‌నాథ్‌ శిందే  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన సందర్భంగా మహారాష్ట్రలోని శంభాజీ నగర్‌లో ఏటా మరఠ్వాడ ముక్తిదిన్‌ నిర్వహిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన హైదరాబాద్‌ విమోచన దినోత్సవ పరేడ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిజాం నిరంకుశ, నియంతృత్వ పాలన నుంచి హైదరాబాద్‌ సంస్థానం విముక్తి పొందిన ఈ రోజు బంగారు పేజీల్లో లిఖించదగ్గ రోజని అన్నారు.

విముక్తి పొందిన ఇన్నేళ్ల తరువాత ఉత్సవం నిర్వహించుకునే అవకాశం దక్కిందని, ఇది ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా వల్లనే సాధ్యమైందని చెప్పారు. విమోచనం కోసం ప్రాణాలర్పించిన వారికి శిందే నివాళులు అర్పించారు. విమోచన ఉత్సవాలు జరపాలని ఎదురు చూస్తున్న ప్రజల కల నేటికి నెరవేరిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. 1948 సెప్టెంబర్‌ 17న అప్పటి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తే.. 75 ఏళ్ల తర్వాత ప్రస్తుత హోం మంత్రి అమిత్‌ షా త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారని గుర్తుచేశారు.

విమోచన ఉత్సవాలు జరపకుండా రజాకార్ల పార్టీ అడ్డుకుందని, అలాంటి పార్టీ కూడా జాతీయ జెండా ఎగరేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చామన్నారు. కర్ణాటకలోని బీదర్, రాయచూరు, యాద్‌గిర్‌ వంటి ప్రాంతాల్లో కూడా రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేశారని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీరాములు గుర్తు చేశారు. బీదర్‌ జిల్లాలోని 76 గ్రామాలు, రాయచూరు జిల్లాలోని 26 గ్రామాల్లో రజాకార్లు అరాచకాలు సృష్టించారని గుర్తు చేశారు.

కార్యక్రమంలో బీజేపీ జా­తీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌ చుగ్, సునీల్‌ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ, జాతీయ కార్యవర్గ స­భ్యులు నల్లు ఇంద్రసేనా రెడ్డి, విజయశాంతి, జి. వివేక్, ఎంపీలు కె.లక్ష్మణ్, ధ­ర్మపురి అర్వింద్‌ కుమార్, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, ధర్మారావు, వన్నాల శ్రీరాములు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement