ఇళ్లను కాపాడుకునేందుకు కోర్టు బాటలో కొందరు
సామాజిక కమిషన్‌ల దారిలో మరికొందరు..
మరోవైపు పోస్టు కార్డు ఉద్యమం
మేమున్నామంటూ భరోసా ఇస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీ పక్షాలు
సాక్షి, హైదరాబాద్: మూసీ నది నివాసితులను కూల్చివేతల దడ వెంటాడుతూనే ఉంది. నదీ ప్రక్షాళన రాజకీయ కేంద్ర బిందువుగా మారి తాత్కాలికంగా కూల్చివేతల ప్రక్రియ నిలిచినా.. భవిష్యత్తులో మళ్లీ వీటి బెడద తప్పదనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో నివాసితులు తమ ఇళ్లను రక్షించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంటుండగా.. మరికొందరు సామాజిక కమిషన్లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు పోరాటం ఆందోళనలు సైతం ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు అధికారేతర రాజకీయ పక్షాలు అండగా తామున్నామంటూ పరీవాహక ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేయిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల పర్యటనలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి.
కోర్టును ఆశ్రయించిన నివాసితులు
మూసీ పరీవాహక ప్రాంతంలోని తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 2,166 నివాసాలు నదీ గర్భంలో ఉన్నట్లు డ్రోన్ సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. రెవెన్యూ అధికారుల బృందం ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో 68 శాతం ఇళ్లకు మార్కింగ్ చేశారు. కొన్ని గృహాలను కూలీల సహకారంతో కూల్చివేశారు. దీంతో కొందరు మూసీ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. చైతన్యపురి, కొత్తపేటలోని దాదాపు 620 కుటుంబాలు కోర్డులో పిటిషన్లు దాఖలు చేయగా, వారిలో 400 నివాసాలకు స్టే వచ్చింది. మరోవైపు ఇటీవల వేసిన ఆర్‌బీ మార్క్‌ను సైతం ఇళ్ల యజమానులు తొలగిస్తున్నారు. తమ ఇళ్లను కూల్చివేయద్దంటూ ఇళ్ల ముందు హైకోర్టు స్టే బోర్డులను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఎస్సీ కమిషన్‌కు దళిత కుటుంబాలు
మూసీ పరివాహకంలో నివాసాలు కూల్చకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎస్సీ కమిషన్‌ను దళిత కుటుంబాలు ఆశ్రయించాయి. కూలిపనులు చేసుకొని జీవనం సాగించే తమ ఇళ్లను అర్ధాంతరంగా కూల్చివేస్తే రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చాదర్‌ఘాట్, శంకర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాలకు చెందిన దళితులు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.
మరోవైపు పోస్టుకార్డు ఉద్యమం
మూసీరివర్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి, గవర్నర్‌తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లకు పోస్టు కార్డులు రాసి పంపించారు. గతంలో చేపట్టిన డ్రోన్ సర్వేపై ఆధారపడకుండా తిరిగి భౌతికంగా సర్వే చేస్తే మూసీకి దగ్గరలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మూసీ సుందరీకరణ కోసం తమ ఇళ్లను వదిలే ప్రసక్తిలేదని నివాసితులు తేల్చి చెబుతున్నారు. న్యాయపోరాటం చేయడానికి సిద్ధమని పేర్కొంటున్నారు.
చదవండి: షాకిస్తున్న కరెంట్ బిల్లులు.. డోర్‌లాక్ పేరుతో అడ్డగోలు బాదుడు
పక్కా నిర్మాణాలతోనే సమస్య..
మూసీ పరీవాహక పరిధిలోకి వచ్చే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 30 శాతం మంది నిర్వాసితులు.. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మెజారిటీ సంఖ్యలో శాశ్వత నిర్మాణాలతో సమస్య తీవ్రమైంది. రూ.లక్షలు ఖర్చు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్న కారణంగా ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చేబుతున్నారు. దీంతో నిర్వాసితులను తరలించడం రెవెన్యూ అధికారులకు కొంత తలనొప్పిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment