మాదాపూర్: వివిధ దేశాలు...50 విభిన్న జాతులకు చెందిన 500 శునకాలు.. 700 రకాల చేపలు...క్యాట్ షో...అంతర్జాతీయ న్యాయనిర్ణేతలు...నగరంలో మొదటిసారిగా ఏర్పాటైన పెటెక్స్–2023 ప్రత్యేకతలివీ. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఎనిమిది మంది అంతర్జాతీయ నిపుణులు పోటీల్లో న్యాయనిర్ణేతలుగా పాలుపంచుకుంటున్నారు.
ఇక ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థ క్యాట్ షోను నిర్వహించనుంది. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల సంరక్షణ పరిశ్రమలో భారత్ ఒకటి అని హైటెక్స్ బిజినెస్ హెడ్ టీజీ శ్రీకాంత్ తెలిపారు. పెంపుడు జంతువుల ప్రాముఖ్యతను వివరించేందుకే ప్రదర్శన ఏర్పాటు చేశారని వెల్లడించారు.
ఆకట్టుకుంటున్న 700 రకాల చేపలు
హైటెక్స్‌లో పెటెక్స్‌లో భాగంగా ఆక్వా జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 700 రకాల చేపలు ప్రదర్శనలో ఉంచారు. చేపలను పెంచేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాంటెడ్ అక్వేరియమ్, మాన్స్‌స్టార్, సెమీ అగ్రెసివ్ అక్వేరియమ్‌లను అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనలో సిల్వర్ డెరోడో చేప ప్రత్యేకంగా నిలుస్తుంది. దీని ధర రూ.3.50 లక్షల రూపాయలు.
దీని ప్రత్యేకత..నీటిలో 12 అడుగుల లోతులో గంటకి 1600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో చివరి రోజు రెడ్‌చిల్లీ అర్వాన చేపను సందర్శకులు తిలకించేందుకు తీసుకువస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దీని ధర. రూ.42 లక్షలు. దీని ప్రత్యేకత..నెగటివ్ ఎనర్జీని తీసివేస్తుందని, అందంగా ఉంటుందని, ఇంట్లో ఉంటో వాస్తుపరంగా బాగుంటుందని జపనీయుల నమ్మకం.
ఆకట్టుకుంటున్న 120 రకాల పిల్లులు
ప్రదర్శనలో దాదాపు 120 రకాల పిల్లులను ఉంచారు. కొన్ని రకాల పిల్లులు చూడడానికి పులులుగా ఉన్నాయి. ఇందులో బెంగాల్ క్యాట్, ట్రెడిషనల్ లాంగ్ హేయిర్, హిమాలయన్, బ్రీటీస్ సార్ట్ హేయిర్, ఎక్సోటిక్ సార్ట్ హెయిర్, మెన్‌కున్ లాంటి బ్రీడ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటి ధర రూ. 50 వేల నుండి రూ.3 లక్షల వరకు ఉన్నాయి.
పక్షులు సైతం..
ఆస్ట్రేలియాకు చెందిన మోలుకన్ కొకాటో పక్షి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటి ధర రూ.50 నుండి ప్రారంభం. నెల ఖర్చు రూ.5 వేల నుండి 8 వేల వరకు ఉంటుంది. గృహాలలో పెంచుకునేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారని నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు బ్లూగోల్డ్ మకావ్, రామచిలుకలు అందుబాటులో ఉన్నాయి.
ప్రతి రోజు అందంగా తయారు చేస్తా..
నా దగ్గర ఉన్న చిన్న డాగ్ షెడ్జి. దీని ధర రూ.28 వేలు. దీనికి నెలఖర్చు రూ.10 వేల వరకు అవుతాయి. ప్రతి నెల డాక్టర్ వద్ద చెకప్ చేయిస్తా. ఒకరిని విడిచి ఒకరం ఉండలేనంత ప్రేమగా చూసుకుంటాను. ప్రతి రోజు అందంగా తయారు చేస్తాను.
– రమన్, జుంతుప్రేమికురాలు
కుక్కలకు రక్తం అవసరం
ప్రమాదాలు వాటిల్లినప్పుడు మనుషులకు రక్తం ఎలా అవసరం ఉంటుందో కుక్కలకూ అలాగే అవసరం. ఎక్కువ రక్తస్రావం అయినప్పుడు, సర్జరీలు చేసేటప్పుడు, రక్తం మార్చవలసిన పరిస్థితి కలిగినప్పుడు మాకు సమాచారం అందిస్తే సంబంధించిన ఇతర కుక్కలను తీసుకువచ్చి రక్తాన్ని ఇస్తాం.
– కౌశిక్, జంతుప్రేమికుడు
కేరింగ్ తీసుకోవాలి
పెంపుడు జంతువులను పెంచాలనే కోరిక, ఆసక్తి ఉన్నప్పుడే వాటిని పెంచగలం, పెండుపు జంతువులను పెంచేవారు డాక్టర్ల సలహాలను, నిపుణులతో సంప్రదించాలి. వాటికి కావాల్సిన ఆహారాన్ని తగినంత మొతాదులో పెట్టాలి. వాటిని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి.
– గణేశ్, వెటర్నరీ డాక్టర్
ఫ్యామిలీలో ఒకరిగా చూస్తాం..
బ్లాక్‌ల్యాబ్‌రో డాగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే పెంచుతున్నా. కుటుంబంలో ఒకరిగా చూసుకుంటాం. మా ఫ్రెండ్స్ సైతం చూడడానికి ఇంటికి వస్తారు. దీని ధర రూ.20 వేల నుండి ప్రారంభం అవుతుంది. దీనికి నెల ఖర్చు రూ.6 వేల నుండి 8 వేల వరకు ఉంటుంది.
– జాగృతి, జంతు ప్రేమికురాలు
Comments
Please login to add a commentAdd a comment