పిట్టకథలు చెబుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు
బంజారాహిల్స్: ‘‘సార్.. వచ్చేనెల 9వ తేదీన నా పెళ్లి.. శుభలేఖలు పంచడానికి స్వయంగా నేనే బయటికి వచ్చాను’’ అంటూ గురువారం ఉదయం ఫిలింనగర్ సీవీఆర్ చౌరస్తాలో చెక్‌పోస్ట్ వద్ద పోలీసులకు ఓ యువతి చెప్పిన విషయం. లాక్‌డౌన్ సమయంలో రాకూడదు కదా అని పోలీసులు ప్రశ్నిస్తే ఈ సమ యంలోనే బంధుమిత్రులు దొరుకుతారని ఆమె సమాధానం. అయితే ఆమెకు పోలీసులు జరిమానా విధించారు.
‘‘సార్.. మా నానమ్మ అపోలో ఆస్పత్రిలో ఉంది. చూడటానికి వెళ్తున్నా.. ఇదిగో మందుల చీటీ’’ అంటూ ఓ యువకుడు తాను బయటికి ఎందుకు వచ్చానో పోలీసులకు చెప్పే ప్రయత్నం. ఆరా తీస్తే ఆ మందుల చీటీ 2019లో తీసుకున్నది. మరింత లోతుగా ప్రశ్నిస్తే ఇంట్లో బోర్ కొడుతోందని చెప్పాడు. ఆయనకు రూ.వెయ్యి జరిమానా విధించారు.
‘‘సార్.. ఇప్పుడే షాప్ బంద్ చేసి వస్తున్నా’’ అంటూ తాను బయటికి ఎందుకు వచ్చానో ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. మీ షాప్ ఎక్కడ దానికి సంబంధించిన ఆధారాలు ఏవని పోలీసులు ప్రశ్నిస్తే పొంతలేని జవాబులు చెప్పాడు. ఆరా తీస్తే తన స్నేహితుడి వద్దకు వెళ్తున్నట్లుగా తేలింది. ఆయనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
‘‘నా పెంపుడు కుక్కకు ఆరోగ్యం బాగాలేదు. ఆస్పత్రికి తీసుకెళ్తున్నానంటూ’’ ఓ వ్యక్తి చెప్పగా పోలీసులు లాక్‌డౌన్ సమయంలో ఇదేం పని అంటూ మందలించి కేసు నమోదు చేశారు.
ఇలా అనవసరంగా లాక్‌డౌన్ సమయంలో రోడ్లపైకి వస్తున్న వారు పోలీసులకు చిక్కగానే చెబుతున్న పిట్టకథలు. రోడ్డుపైకి వస్తున్న వంద మందిలో 8 మంది అనవసరంగా వస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. వీరందరిపై పెట్టీ కేసులు నమోదు చేస్తూ వాహనాలను కూడా జప్తు చేస్తున్నారు. అయినా సరే లాక్‌డౌన్ సమయంలో అనవసరంగా తిరుగుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పోలీసులు ఫొటోలు తీసుకొని పెట్టీ కేసులు నమోదు చేస్తుంటే అదేదీ వాహనదారులకు పట్టడం లేదు. ఫొటోలు తీసుకున్నారు.. పంపించేస్తున్నారు.. అనే ధీమాలోనే వెళ్లిపోతున్నారు. తెల్లవారి మళ్లీ బయట తిరుగుతున్నారు.
♦కరోనా రెండోదశ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించింది.
♦గతేడాది లాక్‌డౌన్‌తో పోల్చుకుంటే వివిధ కారణాలతో బయటికి వస్తున్న వారి సంఖ్య పెరిగింది.
♦సడలింపులు ఎక్కువ కావడంతో లాక్‌డౌన్ సమయంలోనూ రోడ్లపైకి జనం వస్తున్నారు.
♦తెలిసో తెలియకో కొందరు బయట తిరుగుతూ లేనిపోని అనర్ధాలను కొనితెచ్చుకుంటున్నారు.
♦కొన్నిచోట్ల యువకులు సరదా కోసం బయట తిరుగుతుండగా మరికొందరు చిన్నచిన్న అవసరాల రీత్యా రోడ్లపైకి వస్తున్నారు.
♦మరి కొంతమంది మాత్రం పాత మందుల చీటీలు, పడేసిన ఆస్పత్రి ప్రిస్కిప్షన్‌లు పట్టుకొని పోలీసులకు మస్కా కొడుతూ బయట తిరుగుతున్నారు. వారిని పట్టుకొని వివరాలు అడిగితే ఏవేవో కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. అయితే.. పోలీసులు వీరిని గాలికి వదిలేయడం లేదు. ఇలాంటి వారికి జరిమానాలు విధిస్తూ పెట్టీ కేసులు నమోదు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment