సాక్షి, హైదరాబాద్ : నగర శివారులోని రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లి సమీపంలోని పల్లె చెరువు ప్రమాదకర స్థాయికి చేరుకుంది.. భారీ వరదలతో నిండుకుండాలా మారిపోయింది. వరద ఉధృతి క్షణక్షణం పెరుగుతూ ఉండటంతో చెరువుకట్ట ఏ క్షణామైనా తెగిపోయే ప్రమాదం ఉంది. చెరువు కట్ట తెగకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిమెంట్ బస్తాల్లో ఇసుకను నింపి కట్టకు సపోర్టుగా వేస్తున్నారు. కొంతమేర వర్షం తగ్గినప్పటికీ.. వరద తగ్గకపోవడంతో ఇప్పటికే కట్టకు చిన్నబిన్న బుంగలు పడి నీరు బయటకు వస్తోంది. చెరువులో నీటినిల్వ ప్రమాదకరస్థాయికి చేరుకోవడంతో సుభాన్ కాలనీ వాసులు భయాందోళనలో ఉన్నారు. (హైదరాబాద్ సీపీ ఇంట్లోకి వరదనీరు)
గతవారం రోజులుగా వస్తున్న వరదలకు ఇప్పటికే సుభాన్ కాలనీలో ఐదు అడుగుల మేర బురద చేరింది. కార్లు, ద్విచక్రవాహనాలు బుదరలో ఇరుక్కుపోయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో కనీసం వాహనాల ఆనవాళ్లు కూడా కనిపించనంత బురద చేరింది. తమ పరిస్థితిని పట్టించుకోవడానికి ఏ ఒక్క అధికారి కూడా రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో పల్లె చెరువు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పల్లె చెరువు జలదిగ్బంధనంలో చాంద్రాయణగుట్ట, ఫలక్ నామా ప్రాంతాలు చిక్కుకోనున్నాయి. పల్లె చెరువు ప్రాంతాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ప్రమాదం జరుగకముందే స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఇక్కడ పర్యటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని.. పల్లె చెరువు సమీపంలో ఎక్కడ కూడా కబ్జాలు గురైన దాఖలాలు లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment