ఒకే రోజు 6 డ్రంకన్‌ డ్రైవ్‌ ఘటనలు.. నలుగురు మృతి | Hyderabad Traffic Police Conduct Daily Drunk And Drive Test | Sakshi
Sakshi News home page

Drunk And Drive Test: ఇక రోజూ డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు చుక్కేస్తే.. చిక్కినట్టే!

Published Wed, Dec 8 2021 11:04 AM | Last Updated on Wed, Dec 8 2021 11:18 AM

Hyderabad Traffic Police Conduct Daily Drunk And Drive Test - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మందుబాబుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. మద్యం తాగి వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. సోమవారం ఒకేరోజు జరిగిన ఆరు ఘటనల్లో నలుగురు మృత్యువాత పడటం డ్రంకన్‌డ్రైవ్‌ విషాదానికి అద్దం పడుతోంది. ఈ క్రమంలో సిటీ ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇకనుంచి ప్రతి రోజూ రాత్రి వేళ డ్రంకన్‌ డ్రైవ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కేసుల తీరుతెన్నులు, పోలీసులు తీసుకుంటున్న చర్యలపై సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌ విజయ్‌కువర్‌ మంగళవారం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు.  

ఇప్పటి వరకు అప్పుటికప్పుడే... 
►నగర పోలీసు విభాగం 2011 నుంచి డ్రంక్‌ డ్రైవింగ్‌కు అడ్డుకట్ట వేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ ఏడాది నవంబర్‌ నుంచి ప్రతి వీకెండ్‌లోనూ ఈ స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించే వాళ్లు. ఆ తర్వాత కాలంలో దీన్ని విస్తరిస్తూ వారానికి రెండు లేదా మూడు రోజులు చేపడుతున్నారు.  
►తాజా పరిణామాల నేపథ్యంలో ప్రతి రోజూ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ల వారీగా డ్రంకన్‌ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని విజయ్‌కుమార్‌ ఆదేశించారు. ప్రతి పోలీసుస్టేషన్‌లోనూ కనీసం రెండు బృందాల చొప్పున ఉండాలని, నిత్యం ఒకే స్పాట్‌లో కాకుండా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో, కనీసం మూడు గంటల చొప్పున డ్రైవ్‌ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశారు.  
►రానున్న రోజులతో పాటు ప్రత్యేక సందర్భాల్లో ఈ తనిఖీల సమయంతో పాటు చేసే ప్రాంతాల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి తాజా విధానాలు అమలులోకి రానున్నాయి.  

సిబ్బందితో ఇబ్బంది లేకుండా... 
►ప్రతి రోజూ డ్రంకన్‌ డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించడానికి ట్రాఫిక్‌ పోలీసుల్లో ఉన్న సిబ్బంది సంఖ్య ఓ ప్రధాన సమస్యగా మారుతోంది. పగటిపూట రోడ్లపై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు బందోబస్తు విధులకే ఉన్న సిబ్బంది చాలట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి రోజూ కొందరు సిబ్బందితో రెండు బృందాలు ఏర్పాటు చేసి రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్పెషల్‌ డ్రైవ్‌ చేపడితే ఇబ్బందులు ఉంటాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ విధులు నిర్వర్తించిన వాళ్లు మరుసటి రోజు ఉదయం విధులకు హాజరుకాలేదు. ఈ ప్రభావం ట్రాఫిక్‌ తీరుతెన్నులపై ఉంటుంది.  
►ఈ నేపథ్యంలోనే డ్రంకన్‌ డ్రైవింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ కోసం పరిమిత సంఖ్యలో ట్రాఫిక్‌ అధికారులు, అవసరమైన మేర శాంతిభద్రతల విభాగం పోలీసులను వినియోగించనున్నారు. వీరికి సహకరించడానికి సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ హెడ్‌– క్వార్టర్స్‌ నుంచి సిబ్బందిని వెహరించాలని ట్రాఫిక్‌ చీఫ్‌ విజయ్‌కుమార్‌ నిర్ణయించారు.  

ఆ ‘వేగులపై’ ప్రత్యేక నిఘా.. 
►పోలీసులు ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా, ఎన్ని తనిఖీలు చేపడుతున్నా ఆ సమాచారం ‘వేగుల’ ద్వారా తెలుసుకుంటున్న ‘నిషా’చరులుగా తమ ప్రయాణ వర్గాలను మార్చుకుంటున్నారని ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు.  
►ఇలాంటి మందుబాబులకు సహకరించడానికి కొందరు యువకులు వాట్సాప్‌ గ్రూపుల్ని ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఉండే ఈ గ్రూపు సభ్యుల తమ ప్రాంతంలో జరిగే డ్రంక్‌ డ్రైవింగ్‌కు సంబంధించిన సమయం, ప్రాంతం వివరాలను ఇందులో పోస్టు చేస్తున్నారు.  
►వేగుల సమాచారంతో ప్రయాణ వర్గం మార్చుకుంటున్న మందుబాబుల వల్ల కొన్నిసార్లు ప్రమాదాలకు ఆస్కారం ఉందని ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారి కోసం నిఘా వేసి ఉంచాలని, ఆయా గ్రూపుల్ని గుర్తిస్తే వాటి అడ్మిన్స్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అంశం పరిశీలించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.

‘నిషా’ నిందితులకు రిమాండ్‌ మూడ్రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్‌ 
బంజారాహిల్స్‌: మద్యం మత్తులో కారుతో ఢీకొట్టి ఇద్దరు మృతికి కారకులైన  నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఉప్పల్‌ రాఘవేంద్ర కాలేజీకి చెందిన బజార్‌ రోహిత్‌గౌడ్, కర్మన్‌ఫట్‌లో నివసించే వేదుల సాయి సోమన్‌ మద్యం తాగి ఆ మత్తులోనే కారు నడపడంతో ప్రవదం చోటుచేసుకుంది. నిందితులిద్దరిపై ఐపీసీ సెక్షన్‌ 304(2) (నేరపూరిత హత్య), 185 ఎంవీ యాక్ట్‌ కింద కేసు నవెదు చేశారు. వీరికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్త న్యాయమూర్తి తీర్పునిచ్చారు. వీరిద్దరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రవద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు మూడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement