సాక్షి, హైదరాబాద్: ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకాన్ని వర్తింపజేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, వ్యవసాయ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులతోపాటు వ్యవసాయ శాఖ కమిషనర్‌లను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి గతంలో రెండు పిటిషన్లు దాఖలయ్యాయని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు.
దీంతో ఈ వ్యాజ్యాన్ని వాటితో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేస్తూ తదుపరి విచారణను మార్చి 25కు వాయిదా వేసింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది తల్లాడ నందకిశోర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలితో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. ‘రాష్ట్రవ్యాప్తంగా 1.43 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉంది. ఇందులో మెజారిటీ వ్యవసాయ భూములను కౌలుదారులే సాగుచేస్తున్నారు. వారికి ప్రభుత్వం ఎటువంటి పరిహారం ఇవ్వడం లేదు. కొందరు రాజకీయ నాయకులకు వందలాది ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. వీరికీ రైతుబంధు కింద ఆర్థికసాయం అందుతోంది. అర్హులైన ఐదెకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే ఆర్థిక సాయం అందేలా ఆదేశాలు జారీ చేయండి’ అని పిటిషన్‌లో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment