సాక్షి, హైదరాబాద్: ఐఐటీ హైదరాబాద్‌లో ఈ ఏడాది ప్లేస్‌మెంట్ల తొలిదశ విజయవంతంగా ముగిసింది. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి వారం రోజులపాటు నిర్వహించిన ఈ ప్లేస్‌మెంట్ల ప్రక్రియలో ఓ విద్యార్థికి ఏడాదికి ఏకంగా రూ.63.78 లక్షల జీతంతో ఆఫర్ రావడం విశేషం. మలి దశ ప్లేస్‌మెంట్లు వచ్చే నెలలో జరగనున్నాయి. తొలిదశ ప్లేస్‌మెంట్ల మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 474 మంది విద్యార్థులకు 508 ఉద్యోగ ఆఫర్లు లభించినట్లు ఐఐటీ హైదరాబాద్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
మొత్తం ఆఫర్లలో 54 విదేశాలకు చెందినవి కావడం గమనార్హం. జపాన్ అక్సెంచర్, డెన్సో, ఫ్లిప్‌కార్ట్, మోర్గన్ స్టాన్లీ, ఎన్‌టీటీ, ఏటీ, ఒరాకిల్, స్పింక్లర్, సుజుకీ మోటార్ కార్పొరేషన్, టెక్సస్ ఇన్‌స్ట్రుమెంట్, టీఎస్‌ఎంసీ, జొమాటోలతో సహా దాదాపు 144 కంపెనీలు ఈ ప్లేస్‌మెంట్ ప్రక్రియలో పాల్గొన్నాయి. ఏడువందల మంది విద్యార్థులు పాల్గొన్నారు. విదేశీ కంపెనీలు 13 వరకూ రిజిస్టర్ చేసుకున్నాయి.
కృత్రిమ మేధకు పెద్దపీట...
ఐఐటీ హైదరాబాద్ నుంచి కృత్రిమమేధలో బీటెక్ పూర్తి చేసిన తొలి బ్యాచ్‌కు తాజా ప్లేస్‌మెంట్లలో పెద్దపీట దక్కింది. మొత్తం 82 శాతం విద్యార్థులకు ప్లేస్‌మెంట్లు లభించాయి. కోర్ ఇంజినీరింగ్, ఐటీ/సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్ అండ్ కన్సల్టింగ్ రంగాల్లోనూ ప్లేస్‌మెంట్లలో ప్రాధాన్యత లభించింది. ప్యాకేజీల్లో రూ. 63.78 లక్షల వార్షిక వేతనం ఈ ఏడాది రికార్డు కాగా... సగటున రూ.19.49 లక్షల సగటు వేతనం లభించింది. డేటా సైన్సెస్ రంగంలో కృషి చేస్తున్న కంపెనీ బ్లెండ్.. ఎక్కువ ఆఫర్లు 360 విడుదల చేసిన కంపెనీగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment