గందరగోళంగా వాతావరణం.. తెలుగు రాష్ట్రాలకు కొనసాగనున్న వర్షాలు | IMD Weather Forecast: Rain Continues In Telugu States - Sakshi
Sakshi News home page

గందరగోళంగా వాతావరణం.. తెలుగు రాష్ట్రాలకు కొనసాగనున్న వర్షాలు

Published Fri, Sep 8 2023 7:39 AM | Last Updated on Fri, Sep 8 2023 9:03 AM

IMD Monsoon Forecast: Telugu States Rains Continue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/విశాఖపట్నం: మునుపెన్నడూ లేనంతగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రుతుపవనాలు ఆలస్యం కావడం.. వాటికి తుపాన్లు తోడు కావడం.. వర్షాలు ఆలస్యం కావడం..  ఆ వెంటనే కుంభవృష్టి వర్షాలు.. అన్‌సీజన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు.. మళ్లీ కుండపోత వానలు.. ఇలా వాతావరణం గందరగోళంగా తయారయ్యింది.  తెలుగు రాష్ట్రాలపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది.  

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. అయితే ఇవాళ, రేపు తెలంగాణలో విస్తారంగా.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.   

శుక్ర, శనివారాల్లో తెలంగాణ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రత్యేకించి దక్షిణ తెలంగాణను అప్రమత్తం చేసింది. అలాగే.. మూడు నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కొనసాగుతున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని ఉత్తరాంధ్రపై ఏర్పడిన అల్పపీడనం బలహీనపడగా.. మరో ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావం కారణంగా..  వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది విశాఖ వాతావరణ కేంద్రం.

శుక్రవారం.. పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే.. శ్రీకాకుళం,విజయనగరం, విశాఖ,అనకాపల్లి,అల్లూరి , పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

ఈ సీజన్‌లో ఎక్కువే..
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో వర్షపాతం ఆశాజనకంగానే నమోదవుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఏటా జూన్‌ ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 తేదీ వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌గా పేర్కొంటారు. ఈ సీజన్‌కు రాష్ట్రంలో 72.10 సెం.మీ సాధారణ వర్షపాతం. సెప్టెంబర్‌ 7వ తేదీ నాటికే (గురువారం) 74.35 సెం.మీ వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 1.03 శాతం ఎక్కువగానే వర్షం కురడం గమనార్హం.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగానూ వాతావరణం గందరగోళంగా ఉంది. గాలుల వేగం పెరగడంతో.. వాతావరణం వేగంగా మారుతోంది. ఆలస్యంగా వచ్చిన నైరుతీ రుతుపవనాలు క్రియాశీలకంగా ఉన్నాయి. సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి అవి తిరోగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈసారి ముందస్తుగానే ఈశాన్య రుతుపవనాల రాక మొదలవొచ్చని(ఈ నెలలోనే!) ఐఎండీ అంచనా వేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement