సాక్షి, హైదరాబాద్: ఈ నెల 16న తలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంబోత్సవం రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా కనీసం లక్షన్నర మంది రైతులతో బహిరంగ సభను నిర్వహించనున్నామని తెలిపారు. ప్రాజెక్టు విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రాజెక్టు ప్రారంభ ఏర్పాట్లపై మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వలసల జిల్లాగా నాడు పడావుపడ్డ పాలమూరు జిల్లాను ఈ ప్రాజెక్టు పచ్చగా చేస్తుందన్నారు. రంగారెడ్డి జిల్లా భూములకు సైతం నీళ్లు అందిస్తుందన్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్టు ఇదని వ్యాఖ్యానించారు.
గోదావరి పరీవాహకంలో కాళేశ్వరం, కృష్ణా పరీవాహకంలో పాలమూరు–రంగారెడ్డి వంటి గొప్ప ప్రాజెక్టులను ప్రభు త్వం నిర్మించిందని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పూర్తైతే తెలంగాణ ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తవుతాయన్నారు. ప్రారంబోత్సవం ఏర్పాట్లపై సీఎస్, ఇతర శాఖలతో కూలంకషంగా చర్చించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో సభకు ఏర్పాట్లను పూర్తి చేయాలని కేటీఆర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment