గంటకు 130 కిలోమీటర్ల వేగం
ఇప్పటి వరకు ఐసీఎఫ్ కోచ్‌లతో నడిచిన గరీబ్ రథ్
ఇకపై ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో పెరగనున్న భద్రత
సాక్షి, హైదరాబాద్: ఆకుపచ్చ రంగు బోగీలతో పరుగులు తీసే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు సరికొత్తగా ఎరుపు రంగు బోగీలతో పట్టాలెక్కడంతో పాటు శరవేగంగా పరుగులు తీయనుంది. గరీబ్ రథ్ రైళ్లకు ఇప్పటివరకు ఉన్న దశాబ్దాల నాటి ఐసీఎఫ్ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్‌ల స్థానంలో ఇకపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్‌హెచ్‌బీ (లింక్‌హాఫ్‌మెన్ బుష్) కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి.
ఎల్‌హెచ్‌బి కోచ్‌లతో కూడిన గరీబ్ రథ్ ఈ నెల 22 నుంచే సికింద్రాబాద్ నుంచి వైజాగ్‌మధ్య ప్రారంభం కానుంది. ఈ ఎక్స్ ప్రెస్‌లో మొత్తం బోగీలన్నీ తృతీయ శ్రేణి ఏసీ కోచ్‌లే ఉంటాయి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల వల్ల గరీబ్‌రథ్ వేగం గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్‌ల వరకు చేరుకోనుంది. సూపర్ ఫాస్ట్ రైళ్లతో సమానంగా ఇది పరుగులు తీయనుంది.
మిగతా రైళ్ల టికెట్ ధర కంటే చాలా తక్కువ
గోదావరి, ఈస్ట్ కోస్ట్, విశాఖ, కోణార్క్ ఫలక్‌ను మా వంటి సూపర్‌ఫాస్ట్ రైళ్లలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.1080 వరకు ఉంటుంది. కానీ సికింద్రాబాద్ నుంచి విశాఖకు గరీబ్ రథ్ థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.770 ఉంటుంది.
ఇకపై ఆ రైళ్లు కూడా స్పీడ్ రైడ్: గరీబ్ రథ్ రైళ్లను ఎల్‌హెచ్‌బీలుగా మార్చనున్నట్లు రైల్వేబోర్డు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే పరిధిలో కాజీపేట్, విజయవాడ మీదుగా సికింద్రాబాద్ నుంచి విశాఖకు నడిచే రైలుతో పాటు వికారాబాద్, రాయ్‌చూర్ మీదుగా నడిచే సికింద్రాబాద్–యశ్వంత్ పూర్ ట్రై వీక్లీ గరీబ్ రథ్ కూడా ఎల్‌హెచ్‌బీగా మారనుంది.
అలాగే దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి రాకపోకలు సాగించే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – నిజాముద్దీన్, యశ్వంత్‌పూర్–విశాఖ గరీబ్‌రథ్ రైళ్లు కూడా ఎల్‌హెచ్‌బీకి మారనున్నాయి. దశలవారీగా దక్షిణమధ్య రైల్వేలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఐసీఎఫ్ నుంచి ఎల్‌హెచ్‌బీకి మార్చారు. ఇప్పటి వరకు 90% రైళ్లు ఐసీఎఫ్ నుంచి ఎల్‌హెచ్‌బీకి మారగా, మరో 18 రైళ్లు ఐసీఎఫ్ కోచ్‌లతో నడుస్తున్నాయి. త్వరలో వీటినీ ఎల్‌హెచ్‌బీకి మార్చనున్నారు.
ఈ కోచ్‌లు ఎంతో సురక్షితం
⇒ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో ప్రయాణికులకు ఎంతో భద్రత ఉంటుంది.
⇒ దురదృష్టవశాత్తు రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురైనా ఈ కోచ్‌లు ఒకదానిపైకి ఒకటి రాకుండా నిలిచిపోతాయి. దీంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుంది. ఐసీఎఫ్ కోచ్‌లలో ప్రమాదాలు జరిగినప్పుడు కోచ్‌లు ఒకదానిపైకి మరొకటి చేరుతాయి. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం ఎక్కువగా ఉంటోంది.
⇒ అగ్ని ప్రమాదాలు వంటివి జరిగినా వెంటనే వ్యాప్తి చెందవు. ఇటీవల జరిగిన రైలు ప్రమాదాల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉన్న రైళ్లలో ప్రాణనష్టం తక్కువగా ఉండడానికి కారణం కోచ్‌ల సామర్థ్యమేనని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment